గైర్హాజరుపై నిరసన

12 Feb, 2015 02:44 IST|Sakshi
గైర్హాజరుపై నిరసన

సమావేశాల నుంచి బీజేపీ వాకౌట్
 
బెంగళూరు :  అధికార పక్షం నిర్లక్ష్య వైఖరితో విలువైన సభా సమయం వృధా అవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు శాసనసభకు గైర్హాజరు కావడంతో విపక్షాలు వాకౌట్ చేశాయి. శాసనసభలో బుధవారం సభా కార్యక్రమాలు మొదలయిన సందర్భంగా అధికార పక్షానికి సంబంధించి మంత్రులు ఉమాశ్రీ, కిమ్మెనరత్నాకర్, సతీష్‌జారకిహోళితో పాటు ఇద్దరు, ముగ్గురు శాసనసభ్యులు మాత్రమే తమ స్థానాల్లో కనిపించారు. ఇక అధికారుల గ్యాలరీలో సైతం చాలా కుర్చీలు ఖాళీగా కనిపించాయి. దీనిని గమనించిన విపక్షనాయకుడు జగదీష్‌శెట్టర్ అసహనం వ్యక్తం చేశారు.  ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే అధికార పక్షం నాయకులకు చట్టసభలపై గౌరవం లేదని భావించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయనకు బీజేపీ నాయకుడైన అశోక్‌తో పాటు జేడీఎస్ నాయకులైన వై.ఎస్.వీ దత్తా, సిద్ధలింగేగౌడతో పాటు పలువురు మద్దతు పలికారు.  ఇంత జరుగుతున్న అధికార పక్షం నాయకులు ఎవరూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇక స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ శివశంకర్‌రెడ్డి  మాత్రం విపక్ష సభ్యులకు నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరికి అధికార పక్షం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెబుతూ బీజేపీ, జేడీఎస్‌కు చెందిన కొంతమంది సభ్యులు శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయారు.
 
 

మరిన్ని వార్తలు