ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్

23 Dec, 2016 11:17 IST|Sakshi
తిరుపతి: తిరుపతి కార్పొరేషన్‌లో డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్-1 గా పనిచేస్తున్న వెంకట ప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. తిరుపతి రూరల్ మండలం కొరమేణుగుంట గ్రామానికి చెందిన సునీత అనే మహిళ తెలుగుగంగ కొళాయి కనెక్షన్ కోసం కొన్నిరోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది. ధరఖాస్తు చేసి చాలా రోజులైనా ఇంకా మంజూరు కాకపోవడంతో వెంకట ప్రసాద్‌ను కలిసి విషయం గురించి చెప్పింది.
 
దీంతో ఆయన రూ. 30 వేలు ఇస్తేనే పని అవుతుందని తెలిపాడు. రూ. 20 వేలు ఇస్తానని కార్పొరేషన్ అధికారితో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఆమె భర్త తెలియజేశాడు. పథకం ప్రకారం తిరుపతిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోలు పంపు వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని వార్తలు