టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టు నోటీసులు

9 Mar, 2017 22:50 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టు నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 31న విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్యే సండ్రను కోర్టు ఆదేశించింది. తెలంగాణలో 2015లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో భాగంగా కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన సండ్ర అనంతరం బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ఈ టీడీపీ ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ వద్ద కీలక ఆధారాలున్నాయి. 13 మంది సాక్షుల వాంగ్మూలాలను ఏసీబీ సేకరించింది.
(బాబు బండారం బట్టబయలు)


ఈ కేసులో ఏ-1 నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఏ-2 నిందితుడు సెబాస్టియన్‌లతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫోన్ సంభాషణలు జరిపిన ఫోన్ రికార్డు ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌)లను ఏసీబీ కోర్టుకు అధికారులు అందజేశారు. 32 సార్లు సెబాస్టియన్‌తో, 18 సార్లు రేవంత్‌తో సండ్ర సంభాషించినట్లు ఆ ఫోన్ రికార్డులలో ఉంది. ఏసీబీ అధికారులు ఇటీవల ఈ కేసులో దాఖలుచేసిన అనుబంధ చార్జిషీట్‌ లో పలు విషయాలు వెలుగుచూశాయి. 2015 మే 29, 30, 31 తేదీల్లో సెబాస్టియన్‌ –స్టీఫెన్‌సన్‌ సంభాషణలపై పదేపదే చార్జిషీట్‌లో వివరాలను స్పష్టం చేసింది. మొత్తం 15 కాల్స్‌ ఈ మూడు రోజుల్లో ఉన్నాయని, ఇందులోనే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్టు సంభాషణల్లో రికార్డయ్యిందని తెలిపింది.

మరిన్ని వార్తలు