ఏసీబీ సోదాలు

25 Aug, 2016 01:29 IST|Sakshi

సీఎస్ భూ అక్రమాల నేపథ్యం...
భూములకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం
నేను ఏ తప్పూ చేయలేదు: సీఎస్ అరవింద్ జాదవ్


బెంగళూరు:  బెంగళూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోదక దళం (ఏసీబీ) బుధవారం ఉదయం అకస్మాత్తుగా సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అనేకల్ వద్ద ఉన్న రామనాయకనహళ్లి వద్ద ప్రభుత్వం వివిధ వర్గాల వారికి కేటాయించిన భూములకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అరవింద్ జాదవ్ తల్లి ఇదే ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన విషయంలో సీఎస్ పై అధికార దుర్వినియోగ విమర్శలు వచ్చిన విషయం...నగరానికి చెందిన సమాచార హక్కు కార్యకర్త భాస్కరన్ ఇందుకు సంబంధించి ఏసీబీకు మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు స్వీకరించిన 24 గంటల్లోపే ఏసీబీ కలెక్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి సంబంధిత దస్త్రాలను స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మీడియాకు దొరక్కుండా ఉన్న సీఎస్ అరవింద్‌జాదవ్ బుధవారం విడుదల చేసిన  మీడియా ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. ‘నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఆ భూముల కొనుగోలు  సమయంలో నేను కేంద్ర సర్వీసులో ఉంటూ ఢిల్లీలో ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా. భూమి కొనుగోలు నా తల్లి తారాబాయ్ స్వ విషయం. వంశపార్యం పర్యంగా వచ్చిన కొన్ని భూములను అమ్మి వచ్చిన సొమ్ముతో రామనాయకనహళ్లిలోని సర్వే నంబర్ 29లో ఉన్న భూముల్లో కొన్ని ఎకరాలను కొన్నాం. వీటికి సరిహద్దులు (పోడి) నిర్ణయించాలని సంబంధిత రెవెన్యూశాఖ అధికారులను కోరుతూ నిబంధనలమేరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలో నేను ఏ అధికారి పై ఒత్తిడి తీసుకురాలేదు.’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అరవింద్‌జాదవ్ భూ అక్రమాలకు సంబంధించి బుధవారం జరిగిన మంత్రి మండలిలో కొంత చర్చ జరిగింది. కొంతమంది అమాత్యులు ఆయన్ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఈ విషయమై రెవెన్యూశాఖ అందించే నివేదికను అనుసరించి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం. మరోవైపు శాసనసభ విపక్షనేత, బీజేపీ సీనియర్  నాయకుడు సీఎస్ అరవింద్‌జాదవ్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

 
లోకాయుక్తకు మరో ఫిర్యాదు..

అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ భూమిని తన తల్లి పేరుతో కొనుగోలు చేసినట్లు అరవింద్‌జాదవ్ పై రాష్ట్ర లోకాయుక్తలో మరో ఫిర్యాదు బుధవారం దాఖలైంది.  ‘అరవింద్ జాదవ్ భూ అక్రమాల’కు  బెంగళూరు నగర జిల్లా కలెక్టర్ శంకర్‌తో పాటు ఆనేకల్ తాహసిల్దార్ కార్యాలయంలోని కొంతమంది అధికారులు సహకరించారని నగరానికి చెందిన భ్రష్టాచార నిర్మూలన సమితి అధ్యక్షుడు రమేష్ చేసిన సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు