పథకం ప్రకారమే నకరాబాబు హత్య

14 Oct, 2014 02:17 IST|Sakshi
  • రాజకీయ నాయకుడి ఇంటిలో  రాజీకి యత్నాలు
  •  ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థులు
  •  సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు
  •  నిందితుల కోసం ప్రత్యేక బృందాలు  
  • బెంగళూరు : పక్కా ప్రణాళిక ప్రకారమే రౌడీషీటర్ నఖ్రా బాబు అలియాస్ నకరా బాబును హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. హత్య జరిగిన ఇంటిలో సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని సోమవారం పోలీసులు తెలిపారు. ఆదివారం నకరాబాబును ప్రత్యర్థులు హత్య చేసిన విషయం తెల్సిందే.
     
    ఇదిలా ఉంటే ప్రతీకారంతో రగిలిపోతున్న కవల అనుచరులు, నకర బాబులను రాజీ చేయడానికి ఒక జాతీయ రాజకీయ పార్టీకి చెందిన రాజ్‌కమల్ రంగంలోకి దిగాడు. ఇక్కడి బీటీఎం లేఔట్ మొదటి స్టేజ్‌లోని జైభీమానగరలో నివాసం ఉంటున్న ఈయన ఇరువర్గాల వారిని ఆదివారం తన ఇంటికి పిలిపించాడు. ఇంటి ఆవరణలో ఇరువర్గాల వారు చేరుకున్నారు. ఆ సమయంలో రెండు కార్లలో వచ్చిన కవల అనుచరులు వేటకొడవళ్లతో రెచ్చిపోయారు.

    దీంతో ఊహించని సంఘ టనతో నకరాబాబుతో పాటు హీరాలాల్, విశ్వ, బాబు అలియాస్ లక్ష్మణ్‌లు మొదటి అంతస్తులోకి పారి పోయి తలదాచుకోడానికి యత్నిం చారు. అయినా ఫలితం లేకపోయింది. ప్రత్యర్థులు నలుగురిని విచక్షణా రహితంగా హత్య చేశారు. బాబు సంఘటనా స్థలంలో మృతి చెందాడు. గ్యాంగ్‌వార్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని సోమవారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు హంతకుల కోసం గాలిస్తున్నట్లు అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్‌కుమార్ తెలిపారు.
     
    ప్రాణస్నేహితుల మధ్య విభేదాలు   బెంగళూరు నగరాన్ని గడగడలాడించిన రౌడీషీటర్ డెడ్లి సోమ శిష్యులు కవల అలియాస్ విజయ్‌కుమార్ (40), నకరా బాబు. పోలీసు ఎన్‌కౌంటర్‌లో డెడ్లి సోమ మృతి అనంతరం ఇద్దరు 18 ఏళ్ల పాటు నేర సామ్రాజ్యాన్ని ఏలారు. సెటిల్‌మెంట్లు చేసి రూ. కోట్లు సంపాదించారు. 2013లో బెంగళూరు సీసీబీ పోలీసులు అజ్ఞాతంలో ఉన్న కవలను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తన ఆచూకీ బాబు పోలీసులకు ఇచ్చాడని కవల అనుమానం పెంచుకున్నాడు. బెయిల్‌పై వచ్చిన కవల, బాబుపై హత్యాయత్నం చేశాడు.

    అయితే బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం బాబు ప్రధాన అనుచరుడు మంగమ్మనపాళ్య శివును చంపేశాడు. అప్పటి నుంచి కవల హత్యకు నకరా గ్యాంగ్ కాచుకుంది. విషయం తెలుసుకున్న కవల కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని హొసూరుకు మకాం మార్చాడు. ఇదే ఏడాది జూన్ 24న బెంగళూరులోని గరుడా మాల్‌లో జరిగిన ఒక సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న కవల రాత్రి 10.45 గంటల సమయంలో కార్యక్రమం ముగించుకుని కారులో హొసూరు బయలుదేరాడు.
     
    మార్గం మధ్యలో అతని అనుచురులు దిగి ఇంటికి వెళ్లి పోయారు. కార్ణటక- తమిళనాడులోని సిఫ్‌కాట్‌లో కవల ఒక్కడే కారులో వెళ్తుండగా అడ్డగించిన ప్రత్యర్థులు  దాడి చేసి హత్య చేసి పరారయ్యారు. పోలీసులు నకరాబాబుతో పాటు 9 మందిని అరెస్టు చేశారు. వీరందరు జైలు నుంచి బయటకు వచ్చారు.

మరిన్ని వార్తలు