తూటాలకూ వెరవం

25 Nov, 2013 00:29 IST|Sakshi

ఠాణే:   ఇందుమిల్లు ఆవరణలో డాక్టర్ బాబాసాహెబ్  అంబేద్కర్ స్మారకం ఏర్పాటు అంతకంతకూ ఆలస్యమవుతుండడంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండి యా (ఆర్‌పీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సెంట్రల్ మైదానంలో ఆదివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభను ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్ స్మారకం కోసం తనతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు తూటాలను ఎదుర్కొనేందుకు సైతం సిద్ధంగా ఉన్నామన్నారు. మూతపడిన ఇందుమిల్లు ఆవరణలో అంబేద్కర్ స్మారక నిర్మాణ ప్రక్రియను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయన్నారు. వచ్చే నెల ఐదో తేదీ లోగా ఇందుకు సంబంధించిన పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించకపోతే ఆ మరుసటిరోజు ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తామని ఆయన హెచ్చరించారు.

‘మాపై తుపాకులతో ప్రభుత్వం తూటాల వర్షం కురిపించినా వెనక్కి తగ్గం. మిల్లు ఆవరణలోకి చొరబడి పనులను ప్రారంభిస్తాం. అంబేద్కర్ కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగానే ఉన్నాం’ అని అన్నారు. అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించడం కోసం జాతీయ టెక్స్‌టైల్ సంస్థ (ఎన్‌టీసీ) ఇందు మిల్లు స్థలమిచ్చేందుకు అంగీకరించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఆర్‌పీఐ ఆందోళనకు దిగితే దీటైన జవాబిస్తామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ హెచ్చరించారని, అయితే తాము కూడా బలంగా ఉన్నామనే విషయాన్ని ఆయన గుర్తెరగాలన్నారు.
 సర్కారు సిద్ధమే : మాణిక్‌రావ్
 బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించేం దుకు ఆటంకాలన్నీ తొలగిపోయాయని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ముంబైలోని వాడా ప్రాంతంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందుమిల్లు ఆవరణలో అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అంబేద్కర్ స్మారకాన్ని నిర్మిస్తామన్నారు. కొందరు  రాజకీయ లబ్ధి పొందేందుకు ఆందోళన చేస్తున్నా రని మాణిక్ రావ్ ఆరోపించారు.

మరిన్ని వార్తలు