అందుకేనా? ఈ దూకుడు

7 Nov, 2017 05:52 IST|Sakshi

భర్తతో కలిసి చురుగ్గా సేవా, రాజకీయ కార్యక్రమాలు

 రాజకీయ ఎంట్రీ వైపు హీరోయిన్‌ అమూల్య చూపు

ఇప్పటికే రమ్య, పూజాగాంధీ, రక్షిత, జయమాల, ఉమాశ్రీ తదితర అనేకమంది సినీ హీరోయిన్లు, నటీమణులు వెండితెరపై తళుకులీనడం పాత విషయమే. బాలనటిగా సినీ రంగంలో అడుగిడి, ఇటీవలే ఒక ఇంటిదైన 24 ఏళ్ల బెంగళూరు అమ్మాయి, అందాలతార అమూల్య రాజకీయాల్లో హిట్‌ కొట్టాలని చూస్తున్నారా?, లేదా భర్త రాజకీయ జీవితంలో చేదోడువాదోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారా? ఆమె ఉత్సాహం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

బొమ్మనహళ్లి: ఇప్పటికే కన్నడ సినిమా రంగంలో చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు, వస్తున్నారు. కొంతమంది రాజకీయాల్లో కొనసాగుతుండగా మరికొంతమంది ఇలా వచ్చి అలా వెళ్ళిన వారు కూడా ఉన్నారు. ఇటీవలే రియల్‌ స్టార్‌ ఉపేంద్ర కొత్త పార్టీని స్థాపించి వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీచేస్తానని ప్రకటించడంతో అందరి కళ్లు సినీ–రాజకీయాలపై పడ్డాయి. కొంతకాలం కిందటే పెళ్ళి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన కన్నడ ప్రముఖ నటి అమూల్య ఆ తరువాత సినిమాల వైపు చూడలేదు. అయితే ఆ అందగత్తె రాజకీయాల వైపు ఆసక్తిగా ఉన్నట్లు గాంధీనగరలో వినిపిస్తోంది.

సోషల్‌ మీడియాలో హల్చల్‌ చెలువిన చిత్తార సినిమాతో హీరోయిన్‌గా పేరుపొందిన అమూల్య ప్రస్తుతం రాజకీయాల్లోకి రాకపోయినా, భర్త జగదీష్‌తో కలిసి అనేక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటోంది. భర్తది రాజకీయ కుటుంబం. ఆయన బీజేపీ నాయకుడన్నది తెలిసిందే. వీరి నివాసం బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర. అమూల్య తాను పాల్గొంటున్న అన్ని సేవా కార్యక్రమాలను తన ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేస్తోంది. వీటన్నింటినీ చూస్తుంటే అమూల్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుంది అని సన్నిహితులు కొందరు గట్టిగా చెబుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్‌ ఏదో ఒకచోట నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే భార్య అమూల్యను అయినా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి. అందుకే దంపతులు ఇద్దరు కలిసి ఇలా రాజకీయ, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు గాంధీనగర పెద్దలు అంటున్నారు. ఒకవేళ భర్త జగదీష్‌ పోటీ చేసినా ఆయన కోసం, పార్టి కోసం అమూల్య పాటుపడక తప్పదు. అందుకే ఇప్పటినుంచే రాజకీయ, సేవా కార్యక్రమాలతో అనుభవం సంపాదిస్తోంది.

మరిన్ని వార్తలు