బయటపెట్టండి!

30 Dec, 2013 05:26 IST|Sakshi

ముంబై: ఆదర్శ్ కుంభకోణంపై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీలో శనివారం చేసిన వ్యాఖ్యలతో ఈ డిమాండ్లు మరింత ఊపందుకున్నాయి. దిసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టును ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టాలని సమాచార హక్కు కార్యకర్త అనిల్ గల్గాలీ ఆదివారం డిమాండ్ చేశారు. అప్పుడే కుంభకోణంలో నిందితులుగా ఉన్నవారి ముఖాలు ప్రజలకు తెలుస్తాయన్నారు. నివేదిక సిద్ధమై నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దానిని మరాఠీలోకి మార్చుకోలేకపోవడంపై గల్గాలీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం నివేదికను మరాఠీలోకి మార్చుకోవాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం చేసిందన్నారు.
 
 ఆదర్శ్ కుంభకోణంలో నిందితులెవరో నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను వేసి, రూ. 7.04 కోట్లు ఖర్చుచేసిందని, దానిని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చి చర్చ జరిపేందుకు నిరాకరించడమెందుకని ప్రశ్నించారు. కుంభకోణానికి పాల్పడిన రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వమే కవచంలా ఉండి కాపాడుతోందని ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చవాన్ కార్యదర్శి భగవాన్ సాహేకు లేఖ రాశారు. ‘రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం ప్రతి నివేదికను ఆంగ్లంతోపాటు మరాఠీలోకి అనువదించుకోవాలి. ముంబై ఉగ్రదాడిపై నియమించిన రామ్‌ప్రధాన్ కమిటీ నివేదికను రెండు భాషల్లో సిద్ధం చేసుకున్నారు. అయితే ఆదర్శ్ కుంభకోణం నివేదిక విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను తుంగ లో తొక్కుతోంద’ని లేఖలో  పేర్కొన్నారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా