మానసిక రోగులను సాధారణ స్థితికి చేర్చండి

11 Oct, 2013 01:49 IST|Sakshi

సాక్షి, బళ్లారి : మానసిక రోగులను సాధారణ  స్థాయికి చేర్చేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సిన అసవరం ఉందని జిల్లా న్యాయమూర్తి విశ్వేశ్వర్ భట్ అన్నారు. ఆయన గురువారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలోని జిల్లా కోర్టు ఆవరణంలోని న్యాయవాదుల సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మానసిక రోగులను ఆరోగ్యవంతులుగా చేయడంతో వారి తల్లిదండ్రులే కాక సమాజం కూడా కాస్త చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సిద్ధారెడ్డి మాట్లాడుతూ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో కొందరు తెలిసీ తెలియక తప్పులు చేస్తారని, అలాంటి వారిని శిక్షించకూడదని చట్టం కూడా చెబుతున్నట్లు గుర్తు చేశారు. మానసిక రోగులను వీలైనంతగా మామూలు స్థితికి తీసుకుని వస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. మానసిక రోగుల పట్ల వైద్యులతోపాటు బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వారికి చేయూతనిస్తూ ఆరోగ్యవంతులను చేయాలన్నారు.

మానసిక ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేనప్పుడు ఎన్నో నేరాలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి ఆరోగ్య పరిస్థితి బాగు చేయాలి కాని శిక్షించేందుకు ప్రయత్నించకూడదన్నారు. మానసిక వైద్య నిపుణులు కొట్రేష్ మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా పని ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయధీశులు, న్యాయవాదులు, వార్తాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు