జాతీయ చేనేత ప్రదర్శన అదుర్స్

30 May, 2014 00:41 IST|Sakshi

- ఆర్కాట్‌రోడ్డులో ప్రారంభమైన ఎక్స్‌పో        
- జూన్ 15 వరకు కొనసాగనున్న ప్రదర్శన

కొరుక్కుపేట, న్యూస్‌లైన్:భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే చేనేత, హస్తకళా వస్తువులు దశాబ్దాల నుంచి ఆదరణ పొందుతూనే ఉన్నాయి. హస్తకళలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వంతోపాటు, పలు సంఘాలు కృషి చేస్తున్నాయి. భారత దేశానికే వన్నె తెచ్చిన చేనేత, హస్తకళలు మరింతగా బతికించుకునేందుకు పుష్పాంజలి ఖాదీ గ్రామోద్యోగ్ సంస్థాన్ ప్రత్యేకంగా కృషి చేస్తూ చేనేత హస్తకళా ఉత్పత్తులతో ప్రదర్శనలు నిర్వహిస్తోంది.

అందులో భాగంగా చెన్నై, సాలిగ్రామం, భరణీ హాస్పిటల్ సమీపంలోని ఆర్కాట్ రోడ్డులో జాతీయ చేనేత ఎక్స్‌పోను గురువారం నుంచి ప్రారంభించింది. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, హస్త కళాకారులు తమ ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రదర్శనలోని వస్తువులు, హస్తకళాఖండాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీహార్‌కు చెందిన మధుబానీ రింట్ శారీలు, జైపూర్‌కు చెందిన తుషార్ సిల్క్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాంతా సిల్క్ శారీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మధ్య ప్రదేశ్‌కు చెందిన కాశ్మీర్ ప్లోరల్ ఎంబ్రాయిడరీ డ్రెస్ మెటీరియల్స్, ప్యూర్ సాఫ్ట్ కాటన్ బందిని శారీలు, బెంగాళ్ కాటన్ శారీలు, మదురై కాటన్ చీరలు మగువలకు కనువిందు చేస్తున్నాయి. అదేవిధంగా హస్తకళా ప్రియులను లెట్ ఉడ్‌తో, రోజ్ ఉడ్‌తో చేసిన బొమ్మలు, ఆర్ట్ జ్యువలరీ, చిన్నారుల ఆట బొమ్మలు అలరిస్తున్నాయి. జూన్ 15వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు