జడ్జి కోసం పరుగో పరుగు

18 Apr, 2017 11:27 IST|Sakshi
జడ్జి కోసం పరుగో పరుగు

న్యూఢిల్లీ: ఎన్నికల అధికారికి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ లంచం ఇచ్చిన అరెస్ట్ చేసిన మధ్యవర్తి సుఖేష్‌ చంద్రశేఖర్‌ ను కోర్టులో హాజరుపరిచేందుకు ఢిల్లీ పోలీసులు శ్రమించాల్సివచ్చింది. న్యాయమూర్తులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు హైరానా పడ్డారు. సోమవారం సుఖేష్‌ ను అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీ ప్రొసీడింగ్స్‌ కోసం పాటియాలా హౌస్‌ కోర్టు తీసుకొస్తారని భావించారు. అయితే అతడిని టిజ్‌ హజారీ కోర్టుకు తరలించారు.

సోమవారం సాయంత్రం 4.40 గంటలకు అతడిని కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి పోలీసులకు కష్టాలు మొదలయ్యాయి. స్పెషల్ జడ్జి పూనమ్‌ చౌధరి ముందు హాజరుపరిచేందుకు 25 నంబరు కోర్టు గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ జడ్జి కనబడకపోవడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆమె హాఫ్ డే లీవు పెట్టారని తెలుసుకుని మరో ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్‌ ముందు హాజరుపరిచేందుకు నిందితుడిని 313 నంబరు కోర్టు రూములోకి తీసుకెళ్లారు. అక్కడ కూడా జడ్జి లేరు. చేసేది లేక నిందితుడితో పాటు 139 నంబరు కోర్టు గదికి వెళ్లారు. అక్కడ కూడా సేమ్‌ సీన్‌. ప్రత్యేక న్యాయమూర్తి హేమాని మల్హోత్రా లోకపోవడంతో ఉస్సూరుమన్నారు.

ఇక లాభం లేదనుకుని చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సతీశ్‌ కుమార్‌ అరోరా విధులు నిర్వహిస్తున్న 38 నంబరు కోర్టు రూములోకి ప్రవేశించారు. ఇక్కడ కూడా వారికి చుక్కెదురైంది. అరగంట పాటు తంటాలు పడిన తర్వాత పోలీసులు నిందితుడిని స్పెషల్ జడ్జి పూనమ్‌ చౌధరి ఇంటికి తీసుకెళ్లి హాజరుపరిచారు. సుఖేష్‌ ను 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ జడ్జి ఆదేశాలివ్వడంతో పోలీసులు ఊపరి పీల్చుకున్నారు.

>
మరిన్ని వార్తలు