ఉభయచర విమానం ప్రారంభం

24 Feb, 2014 23:00 IST|Sakshi

 ముంబై: రాష్ట్రంలోనే తొలిసారిగా సోమవారం సీ ప్లేన్ (ఉభయచరం) సేవలు ప్రారంభమయ్యాయి.  రాష్ట్ర పర్యాటక శాఖ (ఎంటీడీసీ), మారిటైమ్ ఎనర్జీ హెలి ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్‌ఏఐఆర్) సంయుక్త ఆధ్వర్యంలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పర్యాటక శాఖ మంత్రి ఛగన్ చంద్రకాంత్ భుజ్‌బల్ పచ్చజెండా ఈ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన కార్యదర్శి సుమీత్ మల్లిక్, ఎంటీడీసీ మేనేజింగ్ డెరైక్టర్ జగదీష్ పాటిల్, సంయుక్త మేనేజింగ్  డెరైక్టర్ సతీష్ సోని, ఎంఈహెచ్‌ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్ధ వర్మ, యాంబివాలీ సిటీ సీఈఓ వివేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా పర్యాటక మంత్రి ఛగన్ భుజ్‌బల్ మాట్లాడుతూ పర్యావరణ రంగం సిగలో ఇదొక కలికితురాయని అన్నారు. పర్యాటకులకు అత్యుత్తమ సేవలు    అందిస్తున్నామన్నారు. ఈ సేవలతో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాగా రన్ వేలు లేకపోయినప్పటికీ నగరం నుంచి సమీపంలోని ఇతర ప్రాంతాలకు జలమార్గంద్వారా ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు ఇవి చేరవేస్తాయి. తొలి విడతలో భాగంగా యాంబీవ్యాలీ లోయ, ములా డ్యాం (మెహరాబాద్/షిర్డీ), పవనాడ్యాం (లోణవాలా), వరస్గావ్ డ్యాం (లావాసా), ధూం డ్యాం (పంచగని, మహాబలేశ్వర్) ప్రాంతాలకు సీ ప్లేన్ సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
 వచ్చే నెల ఐదో తేదీనుంచి ప్రయాణికులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.ఎంఈహెచ్‌ఏఐఆర్.ఇన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ సీ ప్లేన్ లో రెండు మోడళ్లు ఉన్నాయి. ఇందులో ఒకదానిలో నలుగురు, మరొక మోడల్‌లో తొమ్మిది మంది ప్రయాణించేందుకు వీలవుతుంది.

మరిన్ని వార్తలు