మళ్లీ తెరపైకి కార్తీ!

27 Apr, 2016 02:04 IST|Sakshi
మళ్లీ తెరపైకి కార్తీ!

 సాక్షి, చెన్నై : ఎన్నికల వేళ మరో మారు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అక్రమాస్తులు అంటూ చిట్టాను తెర మీదకు తెచ్చే పనిలో తమిళ మీడియా నిమగ్నమైంది.  అలాగే, ఆడిటర్ గురుమూర్తి సైతం ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. అవన్నీ అవాస్తవాలని, ఎన్నికల్లో దెబ్బ తీయడానికి కుట్రగా కార్తీ ఖండించారు. యూపీఏ హయాంలో  కేంద్రంలో తొలుత ఆర్థిక మంత్రిగా, తదుపరి హోం మంత్రిగా తన తండ్రి చిదంబరం ఉన్న సమయంలో కార్తీ చిదంబరం స్వలాభాన్ని చూసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 2జీ వ్యవహారంలోనూ పరోక్షంగా లాభ పడ్డట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమార్జనతో విదేశాల్లో కార్తీ చిదంబరం ఆస్తుల్ని గడించినట్టు, అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఆరోపణలు గుప్పించే వాళ్లు అధికం అయ్యారు. అయితే, వీటిని కార్తీ ఖండిస్తూ వస్తున్నారు.
 
 ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో మారు కార్తీ చర్చ తమిళ మీడియాలు కొన్ని తెర మీదకు తెచ్చే పనిలో పడ్డాయి. డీఎంకే, కాంగ్రెస్ కూటమిని దెబ్బ తీయడానికి ఈ కుట్ర సాగుతున్నదా? లేదా, కార్తీ గడించిన ఆస్తుల చిట్టా ఇదేనా..? అన్న చర్చ తాజాగా బయలు దేరింది. ఇందుకు తగ్గట్టుగా కార్తీ ఎక్కడెక్కడ ఆస్తుల్ని కొనుగోలు చేసి ఉన్నారో, సంస్థల్లో పెట్టుబడులు పెట్టారో వివరిస్తూ చిట్టా రూపంలో కథనాలు బయలు దేరాయి. ఇందులో సింగపూర్‌కు చెందిన సంస్థ ద్వారా లండన్, దుబాయ్, ఫిలిఫైన్స్, దక్షిణాఫ్రికా, మలేషియా, థాయలాండ్, సింగపూర్, స్పెయిన్ తదితర యాభై దేశాల్లో ఈ ఆస్తులు ఉన్నట్టుగా ఆచిట్టాలో వివరించడం గమనార్హం. అదే సమయంలో ఆడిటర్ గురుమూర్తి సైతం కార్తీ చిదంబరం పై తీవ్ర ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. అయితే, ఇవన్నీ అవాస్తవాలని, కట్టుకథలుగా కార్తీ చిదంబరం వ్యాఖ్యానిస్తున్నారు.ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, డీఎంకే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేతో మాత్రమే ప్రధాన పోటీ అని, మిగిలిన వాళ్లంతా డిపాజిట్లను గల్లంతు చేసుకోవడం ఖాయం అని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు