మళ్లీ ఢిల్లీ బాట

11 May, 2017 02:34 IST|Sakshi
మళ్లీ ఢిల్లీ బాట

► అన్నదాత సిద్ధం
► 18న పయనం
► ఈసారి గోచితో బైటాయింపు
► సీఎంతో అయ్యాకన్ను టీం భేటీ


సాక్షి, చెన్నై: అన్నదాతలకు మద్దతుగా రైతు నాయకుడు అయ్యాకన్ను నేతృత్వంలో మళ్లీ ఢిల్లీ వేదికగా పోరుబాట సాగనుంది. ఈనెల 18వ తేదీ రైతులు ఢిల్లీకి బయలు దేరనున్నారు. ఇందులో భాగంగా బుధవారం సీఎంతో అయ్యాకన్ను నేతృత్వంలో ప్రతినిధులు భేటీ అయ్యారు. కరువు కోరల్లో చిక్కి తల్లడిళ్లుతున్న తమిళ రైతును ఆదుకోవాలని నినదిస్తూ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతు సంఘం నేత అయ్యాకన్ను ఢిల్లీ వేదికగా 41 రోజుల పాటుగా సాగించిన పోరుబాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వేదికగా ఓ తమిళుడి నేతృత్వంలో వివిధ రూపాల్లో సాగిన ఈ నిరసన చర్చకు దారి తీసింది. ఎట్టకేలకు సీఎం పళనిస్వామి, కేంద్ర సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా పోరు బాటను గత నెలాఖరులో విరమించారు. ఆ సమయంలో కేంద్రానికి నెల రోజుల పాటుగా గడువు ఇచ్చారు. అంతలోపు తమ డిమాండ్లను నెరవేర్చాలని, తమిళ రైతును ఆదుకునే ప్రకటన చేయాలని విన్నవించారు. అయితే, ఇప్పటి వరకు ఆ దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మళ్లీ పోరుబాటకు అయ్యాకన్ను బృందం సిద్ధమైంది.

మళ్లీ ఢిల్లీకి : మళ్లీ ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధపడ్డ అయ్యాకన్ను బృందం ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఆ మేరకు ఉదయం గ్రీన్‌ వేస్‌రోడ్డులోని ఇంట్లో సీఎంతో భేటీ అయ్యారు. తమ డిమాండ్లను సీఎం ముందు ఉంచారు. మళ్లీ పోరుబాట సాగించనున్నామని స్పష్టం చేసి బయటకు వచ్చారు. ఈసందర్భంగా మీడియాతో అయ్యాకన్ను మాట్లాడుతూ రైతు సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జాతీయ బ్యాంకులు జప్తు నోటీసులు జారీ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ బ్యాంకులు జారీ చేసిన నోటీసులను పరిగణలోకి తీసుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. చెరకు రైతులకు బకాయిల చెల్లింపునకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఇక, కేంద్రం మీద ఒత్తిడి పెంచే విధంగా మళ్లీ ఢిల్లీ బాటకు సిద్ధమయ్యామని తెలిపారు.

ఈనెల 18వ తేదీ చెన్నై నుంచి గోచితో ఢిల్లీకి బయలు దేరనున్నామని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఉన్న మూడు వందలకు పైగా రైతు సంఘాలతో ఇప్పటి నుంచి సంప్రదింపులు జరుపుతున్నామని, వారి మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డట్టు వివరించారు. ఢిల్లీ చేరగానే, అన్ని సంఘాలతో సమావేశం అనంతరం 21వ తేదీ పార్లమెంట్‌ లేదా, పీఎంవో ముట్టడికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే, జంతర్‌ మంతర్‌ వద్ద గోచితో బైఠాయించి నిరసనల మరింత ఉధృతం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు