హైకోర్టులో హైడ్రామా: అగ్రిగోల్డ్ నిందితులపై దాడి

11 Apr, 2016 19:49 IST|Sakshi
పోలీసుల అదుపులో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాసు వెంకటరామారావు, డైరెక్టర్లు (ఫైల్ ఫొటో)

ముదుపు పేరుతో లక్షల మందికి టోకారా ఇచ్చి, వేల కోట్లు ఎగవేసిన అగ్రిగోల్డ్ సంస్థ యజమానులపై బాధితులు దాడిచేశారు. కేసు విచారణ నిమిత్తం నిందితులను సోమవారం బెంగళూరులోని కర్ణాటక హైకోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. తమ రెక్కల కష్టాన్ని దోచుకున్నారంటూ కోర్టు ఆవరణలో ఆందోళనకు దిగిన బాధితులు.. ఒక్కసారిగా  అగ్రిగోల్డ్ యజమానులపై విరుచుకుపడ్డారు.

సంస్థ చైర్మన్ అవ్వాసు వెంకటరామారావు, ఆయన సోదరుడు శేషునారాయణతోపాటు మరో ముగ్గురు డైరెక్టర్లపై బాధితులు చెప్పులు, రాళ్లతో దాడిచేశారు. దీంతో హైకోర్టు ఆవరణ రణరంగాన్ని తలపించింది. బాధితులు వందల సంఖ్యలో గుమ్మికూడటంతో పోలీసులు కూడా పరిస్థితిని అదుపుచేయలేకపోయారు. అతికష్టం మీద నిదితులను సరక్షిత ప్రాంతానికి తరలించగలిగారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ అగ్రిగోల్డ్ సంస్థ ముదుపుదారులకు కుచ్చుటోపీ పెట్టింది. ఇదే విషయమై కర్ణాటకలోనూ పలు కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ నిందితులను కర్ణాటక సీఐడీ పోలీసులు పది రోజుల కిందటే నెల్లూరు  జిల్లా నుంచి కర్ణాటకకు తరలించి అక్కడ విచార్తిస్తున్నారు. 

 

అయితే ఇదే కేసుపై హైదరాబాద్ హైకోర్టులో సమగ్ర విచారణ జరుతున్న నేపథ్యంలో  కర్ణాటక సీఐడీ విచారణను నిలిపివేయాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. నిందితులైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కర్ణాటక హైకోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జడ్జి ఆదేశానుసారం వారిని హైదరాబాద్ కోర్టుకు తరలించేందుకు వాహన ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. బాధితుల దాడిలో పలువురు లాయర్లకు కూడా గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు