పన్నీరు పట్టు

18 Aug, 2017 04:17 IST|Sakshi
పన్నీరు పట్టు

హోం, డిప్యూటీకి ఒత్తిడి
మరో రెండు కీలక శాఖలకు కూడా
దీప ఫిర్యాదు
బెదిరింపు ధోరణిలో పళని
మాట మార్చిన ఎమ్మెల్యేలు

 
విలీనం వ్యవహారంలో పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం తెరమీదకు మరికొన్ని డిమాండ్లను తెచ్చారు. తనకు హోం శాఖతోపాటు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలనే డిమాండ్‌ను అమ్మ శిబిరం ముందు ఉంచారు. అలాగే, ప్రజా పనులు, ఆర్థిక శాఖ తన శిబిరం ఎమ్మెల్యేలకు అప్పగించాలన్న ప్రతిపాదనను పంపించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇక, ఈ రెండు శిబిరాల విలీనం నాటకాన్ని అస్త్రంగా చేసుకుని ఎన్నికల కమిషన్‌కు దీప ఫిర్యాదు చేశారు. .

సాక్షి, చెన్నై:  అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాల విలీన ప్రయత్నం ఆ పార్టీ కార్యాలయానికి కూత వేట దూరంలో ఆగింది. పన్నీరును అక్కున చేర్చుకునేందుకు సీఎం పళని నేతృత్వంలోని అమ్మ శిబిరం మూడు మంత్రి పదవులతో పాటు పార్టీ పరంగా కీలక పదవులను కూడా ఆఫర్‌ చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డ విషయం తెలిసిందే. శశికళ, దినకరన్‌లకు ఉద్వాసన వ్యవహారం మరి కొద్ది రోజుల్లో తేల్చేస్తామన్న సూచనను పన్నీరు శిబిరానికి పంపారు.

తాజాగా, అమ్మ మరణం మిస్టరీ తేల్చేందుకు తగ్గ విచారణ కమిషన్‌ డిమాండ్‌ను పళని నెరవేర్చడంతో విలీనానికి అనుకూలంగానే  నిర్ణయం తీసుకునే పనిలో కేడర్‌తో మంతనాల్లో పన్నీరు  నిమగ్నం అయ్యారు. అయితే, తాను సీఎంగా, పార్టీ కోశాధికారిగా చక్రం తిప్పి ఉన్న దృష్ట్యా, ఆ హోదాకు తగ్గట్టుగా పదువుల్ని కట్టబెట్టాలనే డిమాండ్‌ను అమ్మ శిబిరం ముందు పన్నీరు ఉంచినట్టు తెలిసింది. పార్టీలో కీలక పదవితో పాటుగా ప్రభుత్వంలో తనకు డిప్యూటీ సీఎం, హోం శాఖ, ఆర్థిక, ప్రజా పనుల శాఖను అప్పగించాలని ఒత్తిడి తెచ్చే పనిలో పడ్డట్టు సమాచారం.

అలాగే, తన శిబిరానికి చెందిన పాండియరాజన్, సెమ్మలైలకు మంత్రి పదవుల్ని కట్టబెట్టాలని సూచించారు. పన్నీరుతో పాటు మరో ఇద్దరికి మంత్రి పదవుల్ని ఇచ్చేందుకు పళని అంగీకరించినా, శాఖల విషయంలో సందిగ్ధంలో ఉన్నట్టు అమ్మ శిబిరం వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యంత కీలక శాఖలను పన్నీరు ఆశిస్తుండడంతో ఆచి తూచి స్పందించేందుకు పళని వర్గం నిర్ణయించింది.

ఈ విషయంగా ఇరు శిబిరాలు చర్చించుకుని రెండు మూడు రోజుల్లో విలీనం విషయంగా స్పష్టతను తెలియజేసే అవకాశాలున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా, డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నా, ఓవైపు పన్నీరు మెట్టుదిగక పోవడం, మరో వైపు దినకరన్‌ రూపంలో తనకు సంకట పరిస్థితులు బయలుదేరడంతో సీఎం పళని స్వామి సైతం బెదిరింపు ధోరణికి సిద్ధం కావడం గమనార్హం. గురువారం ఓ కార్యక్రమం అనంతరం  మీడియాతో మాట్లాడుతూ, సహనం ఉన్నంతవరకు అన్నీ, తాను ఎవ్వరికీ భయపడనని, భయపడాల్సిన అవసరం లేదంటూ సీఎం స్పందించారు.

మాట మార్చిన ఎమ్మెల్యేలు
తన మద్దతు ఎమ్మెల్యేలను పళని కిడ్నాప్‌ చేయించారని ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మాట మార్చడం గమనార్హం. తమను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, తామే దినకరన్‌ సభకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తిరుప్పర గుండ్రం ఎమ్మెల్యే బోసు, మేలూరు ఎమ్మెల్యే పెరియ పుల్లాన్, ఉసిలం పట్టి ఎమ్మెల్యే నీథిపతి గురువారం మీడియా ముందు స్పష్టంచేశారు. అన్నాడీఎంకేలో అందరూ ఒక్కటేనని, పళని, పన్నీరు, దినకరన్‌ తమకు సమానమేనని ఈ ముగ్గురు స్పందించడం ఆలోచించ దగ్గ విషయం.

దీప ఫిర్యాదు
అన్నాడీఎంకేలో అమ్మ, పురట్చి తలైవి శిబిరాల విలీనం చివరి అంకాన్ని తాకిన నేపథ్యంలో, దివంగత సీఎం జయలలిత మేనకోడలు, ఎంజీయార్, అమ్మ, దీప పేరవై నేత దీప ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు శిబిరాల వ్యవహారాలను, గతంలో సాగిన పరిణామాలు గుర్తుచేస్తూ, అన్నీ నాటకాలేనని, రెండాకుల చిహ్నం తనకు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి విషయాన్ని త్వరితగతిన తేల్చాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా