అమ్మపార్టీ నాదే!

15 Jun, 2017 06:10 IST|Sakshi
అమ్మపార్టీ నాదే!

అన్నాడీఎంకే కోసం నాలుగో పోరు  
పోటీకి దిగిన దీప
నేడు ఎన్నికల కమిషన్‌కు 50వేల ప్రమాణపత్రాలు


అమ్మ మరణం తరువాత ముక్కలై చివరకు నిషేధానికి గురైన అన్నాడీఎంకే కోసం నాలుగోపోరు మొదలైంది. సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌లతో పాటు జయలలిత మేనకోడలు దీప కూడా పోటీకి దిగారు. అమ్మ అన్నకూతురైన తానే అన్నాడీఎంకేకి అసలైన వారసురాలినని పేర్కొంటూ 50వేల ప్రమాణపత్రాలతో గురువారం ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్చించనున్నారు.  

సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత ఆమె అన్న కుమార్తె దీప ‘ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై’ ని ప్రారంభించారు. అన్నాడీఎంకేలో ఇప్పటికే సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చెరో వర్గంగా కొనసాగుతుండగా జైలు నుంచి వచ్చిన దినకరన్‌ తనో వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై ఇక అన్నాడీఎంకే దీప వర్గంగా పనిచేస్తుందని కొన్నినెలల క్రితం దీప ప్రకటించారు. అన్నాడీఎంకే పార్టీ ముక్కలు కావడంతో ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల సమయంలో ఆ పార్టీ, రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించింది.

ఎంజీ రామచంద్రన్‌ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నంను దక్కించుకునేందుకు మూడువర్గాలు పోటీపడుతున్నారు. ఎన్నికల కమిషన్‌కు రూ.60 కోట్ల ముడుపులు ముట్టజెప్పడం ద్వారా దొడ్డిదారిలో రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని టీటీవీ దినకరన్‌ చేసిన ప్రయత్నం బెడిసికొట్టగా కటకటాలపాలయ్యాడు. ఎన్నికల కమిషన్‌కు దశలవారీగా వేలకొలది డాక్యుమెంట్లు సమర్పిస్తూ అన్నాడీఎంకేను సొంతం చేసుకునేందుకు ఎడపాడి, పన్నీర్, దినకరన్‌ వర్గాలు పాకులాడుతున్నాయి.

నేను సైతం : దీప
పోయస్‌ గార్డెన్‌లోని జయలలిత ఇల్లు తనకే చెందాలంటూ ఇటీవల పోరుబాటపట్టిన దీప తాజాగా అన్నాడీఎంకేకి తానే అసలైన వారసురాలిననే నినాదాన్ని భుజానెత్తుకున్నారు. అత్త మరణం తరువాత ఆమె పార్టీపై ఆధిపత్యం తనదేనని చెప్పుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నంను సాధించుకునేందుకే దీప పేరవైని అన్నాడీఎంకే దీప వర్గంగా మార్పులు చేసినట్లు గతంలో చెప్పిన దీప తాజాగా కార్యాచరణలోకి దిగారు. అన్నాడీఎంకేకి చెందిన వివిధ అనుబంధ శాఖలు సంతకాలు చేసిన 50 వేల ప్రమాణపత్రాలను ఎన్నికల కమిషన్‌కు గురువారం సమర్పించనున్నారు.

ఆ పత్రాలను ఎన్నికల కమిషన్‌కు స్వయంగా అందజేసే నిమిత్తం దీప వర్గ ప్రధాన అధికార ప్రతినిధి, న్యాయవాది పశుంపొన్‌ పాండియన్‌ తదితరులు ఢిల్లీ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలని, శశికళ స్థానంలో సరైన విధానంలో మరలా ఎన్నిక నిర్వహించాలని, పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి నేతలు సైతం సంతకాలు చేసిన ప్రమాణ పత్రాలు పరిశీలించి అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నంను దీపకు అప్పగించి ఆపార్టీకి అసలైన వారసులుగా ప్రకటించాలని తదితర కోర్కెలతో ఎన్నికల కమిషన్‌కు గురువారం వినతిపత్రం సమర్పించనున్నారు.

మరిన్ని వార్తలు