అమ్మ సీడ్స్‌కు శ్రీకారం

3 Jan, 2016 03:35 IST|Sakshi

 సేవా కేంద్రాల్లో విక్రయం
 తిరుచ్చి, మదురైలకు
 డాబా గార్డెన్ విస్తరణ


 కొత్త ఏడాది  ‘అమ్మ’ పేరిట మరో పథకం అమల్లోకి వచ్చింది. అన్నదాతలకు నాణ్యమైన విత్తనాల్ని అందించేందుకు అమ్మ సీడ్స్‌ను ప్రవేశ పెట్టారు. అమ్మ సేవా కేంద్రాల్లో ఈ సీడ్స్ చౌక ధరకే  విక్రయించనున్నారు. ఇక, డాబా గార్డెన్స్, ఇంటి తోటను తిరుచ్చి, మదురై నగరాలకు విస్తరించారు.
 
 సాక్షి, చెన్నై:
 అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక అమ్మ(జయలలిత)పేరుతో పథకాలను అమలు చేస్తూ వస్తున్న విష యం తెలిసిందే. ఇప్పటికే అమ్మ క్యాంటీన్లు, వాటర్, కూరగాయ ల దుకాణాలు, సిమెంట్స్ తదితర పథకాలు జోరుగా సాగుతూ వస్తున్నాయి. తాజాగా అన్నదాతల ప్రగతి లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న  సీఎం జయలలిత, తాజాగా వారికి నాణ్యమైన విత్తనాలు చౌక ధరకే అందించేందుకు నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా విత్తన అభివృద్ధి మండలి ఏర్పాటు చేశారు. అన్నదాతలు, విత్తన ఉత్పత్తి దారులు, వ్యవసాయ నిపుణుల సమన్వయంతో అమ్మ సీడ్స్ ఉత్పత్తికి చర్యలు తీసుకున్నారు. శనివారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో అమ్మ సీడ్స్ విక్రయానికి సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. సర్టిఫైడ్ విత్తనాలు చౌక ధరకే అమ్మ సేవా కేంద్రాల ద్వారా
 
  రైతులకు అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే, చెన్నై, కోయంబత్తూరులలో మీరే పండించండి...నినాదంతో విజయవంతంగా సాగుతున్న డాబా గార్డెన్, ఇంటి తోట సాగుబడికి వస్తున్న స్పందన ఆధారంగా ఈ పథకాన్ని తిరుచ్చి, మదురైలలోనూ అమలు చేయడానికి నిర్ణయించారు. ఇక, వ్యవసాయ శాఖ నేతృత్వంలో విరుదునగర్ జిల్లా అరుప్పుకోటైలో కోటి 40 లక్షలతో నిర్మించిన విక్రయ కేంద్రాన్ని, రూ. 28 కోట్లతో నిర్మించిన  ఆధునిక గిడ్డంగులు, విత్తన శుద్ధీరణ కేంద్రాలు, తదితర భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జయలలిత ప్రారంభించారు.
 

>
మరిన్ని వార్తలు