అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు

22 Feb, 2017 21:09 IST|Sakshi
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు బెదిరింపులు

చెన్నై‌:
ముఖ్యమంత్రి ఎడపాడి పళనిసామికి మద్దతుగా ఓటు వేసిన ఎమ్మెల్యేలపై ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు పోలీసుల భద్రతతో తమ నియోజకవర్గాలు చేరుకుంటున్నారు. మదురై, నీలకోట్టై ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ రావడం సంచలనం కలిగించింది. నీలకోట్టై నియోజకవర్గం కార్యాలయానికి, అతని ఇంటికి పోలీసులు భద్రతను ఏర్పాటుచేసిన నేపథ్యంలో మంగళవారం ఉదయం నీలకోట్టై ఎమ్మెల్యే తంగదురై 12 రోజుల తర్వాత భారీ పోలీసు భద్రత నడుమ నీలకోట్టై చేరారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి తనకు వచ్చిన ఫోన్‌ కాల్స్‌లో ఎడపాడి పళనిసామికి ఓటు వేయాలని కోరారని వారి కోరిక మేరకు తాను ఓటు వేసి గెలిపించినట్లు తెలిపారు.

అయితే కొంతమంది తనను ఫోన్‌ లో అసభ్యకరంగా దూషిస్తున్నారని, అయితే ప్రజలు కొంతకాలం తర్వాత నిజం తెలుసుకుని ఎడపాడి పళనిసామిని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. మదురై జిల్లా మేయర్, అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెల్వం ఎడపాడికి ఓటు వేసి గెలిపించినందున అతనిపై నియోజకవర్గం ప్రజలు కోపంతో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి శశికళకు మద్దతుగా ఓటెందుకు వేశారని అడగగా సెల్వం పొగరుగా సమాధానం ఇచ్చిన సంగతి దావానలంలా వ్యాపించింది. అందులో మీకు ఓటువేసి గెలిపిస్తే ఎందుకిలా చేశారని అతడు అడగగా అందుకు ఎమ్మెల్యే నేను అన్నాడీఎంకేను గెలిపించాను సంతోషించమని జవాబుచెప్పాడు. ఈ విషయమై ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదంలో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తిని బెదిరించినట్లు తెలుస్తోంది. ఓటు వేసేందుకు ముందు ప్రజల మద్దతు ఎవరికనే విషయం ఎందుకు అడగలేదని ప్రశ్నించగా ఎమ్మెల్యే టక్కున ఫోన్‌ పెట్టేసిన దృశ్యం మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా