డీఎంకే ఎంపీకి చెంపదెబ్బలు

1 Aug, 2016 01:19 IST|Sakshi
డీఎంకే ఎంపీకి చెంపదెబ్బలు

తిరుచ్చి శివను నాలుగు దెబ్బలు కొట్టానన్న అన్నాడీఎంకే ఎంపీ శశికళ
* కాదు ఒక్కటేనన్న శివ
* ఢిల్లీ విమానాశ్రయంలో ఘటన

సాక్షి, చెన్నై: ఢిల్లీ విమానాశ్రయం వేదికగా చెంపలు పగులగొట్టేలా గొడవకు దిగిన డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీల వ్యవహారం తమిళనాడులో దుమారం రేపింది. డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, అన్నాడీఎంకేకు చెందిన శశికళ పుష్ప రాజ్యసభ సభ్యులు. ఇటీవల శివ, శశికళ సన్నిహితంగా ఉండే ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీనిపై రాష్ట్రంలో  చర్చ జరిగింది. ఇది సద్దుమణగకముందే వీరిద్దరు గొడవ పడ్డారు.

శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చేందుకు శివ, శశికళ వేర్వేరుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఢిల్లీ విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే గొడవ చోటు చేసుకుంది. తమ అమ్మ (జయలలిత)ను, ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమానాశ్రయ సెక్యూరిటీ వద్ద శివ అవహేళనగా వ్యాఖ్యలు చేయడంతో తాను నాలుగుసార్లు ఆయన చెంప పగలగొట్టినట్టు శశికళ చెప్పారు. దీంతో ఆగ్రహించిన శివ అనుచరులు తన ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారం తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో ఇద్దరు ఎంపీలు తమ పార్టీ అధిష్టానాలకు వివరణ ఇచ్చుకున్నారు.
 
పనిగట్టుకుని గొడవ పడ్డారు.. శివ: విమానాశ్రయ సిబ్బంది తనకు మర్యాద ఇచ్చి, ఆమెకు ఇవ్వలేదన్న అసూయతోనే శశికళ పనిగట్టుకుని తనతో గొడవ పడ్డారని శివ చెప్పారు. చెన్నైకి వచ్చేందుకు బోర్డింగ్ పాస్ తీసుకుని, అత్యవసర పనిపడటంతో దాన్ని రద్దు చేసుకుని బయటకు తిరిగి వస్తున్నప్పుడు తన చొక్కా లాగి మరీ ఓ చెంప దెబ్బ కొట్టారని తెలిపారు.  మహిళా ఎంపీ కావడంతో తాను కనీసం వాగ్యుద్ధానికీ దిగలేదని, భద్రతా సిబ్బంది సూచనతో బయటకు వచ్చేశానని చెప్పారు.

తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఉద్దేశించి విమర్శలు, ఆరోపణలు చేసి ఉంటే, ఇలా బహిరంగంగా కొట్టే సంస్కృతి ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీఎంకే చీఫ్ కరుణానిధికి శిశ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఇక, శశికళ పోయెస్ గార్డెన్‌కు చేరుకుని సీఎం, తమ పార్టీ అధినేత్రి జయలలితకు వివరణ ఇచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను మీడియా చుట్టుముట్టగా ఆమె మౌనంగా వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు