రెండాకులు దక్కేనా?

22 Apr, 2017 02:57 IST|Sakshi
రెండాకులు దక్కేనా?

► అదనపు ఆధారాలు కోరిన ఎన్నికల కమిషన్‌         
► జూన్‌ 16 వరకు గడువు


వైరివర్గాల పోరుతో తాత్కాలిక నిషేధానికి గురైన రెండాకుల చిహ్నం చివరికి ఎవరికైనా దక్కేనా ఎన్నికల కమిషన్‌ చేతుల్లో శాశ్వతంగా ఎండిపోయేనా అనే అనుమానాలు నెలకొన్నాయి. రెండాకుల చిహ్నం పొందడంలో ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన రెండునెలల గడువు సద్వినియోగం చేసుకోకుంటే గతేమిటని ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాల్లో భయం ప్రారంభమైంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి, రెండాకుల చిహ్నంకు రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉంది. రెండాకుల చిహ్నం చూడగానే ప్రజల కళ్ల ముందు ఎంజీఆర్, జయలలిత కదలాడుతారు. అంతే పూనకం వచ్చినట్లుగా బ్యాలెట్‌ పేపరు మీదున్న రెండాకుల గుర్తుపై ఓటు ముద్రవేస్తారు. ఏదో బలమైన తప్పుచేసినపుడు మాత్రమే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఓడించారు, లేకుంటే శాశ్వతంగా అధికారంలో ఉండగల సత్తా ఆ పార్టీకి ఉందని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. అమ్మ మరణం తరువాత ఆ పార్టీపై అజమాయిషీ కోసం శశికళ, పన్నీర్‌సెల్వం రాజకీయ పోరాటానికి దిగారు.

పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదనే వాదనతో జాతీయ ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు విచారణలో ఉండగానే ఆర్కేనగర్‌ ఎన్నికలు వచ్చాయి. శశికళ ఎంపిక విచారణను పక్కనపెట్టిన ఎన్నికల కమిషన్‌ రెండాకుల చిహ్నం ఏ వర్గానికి ఇవ్వాలనే అంశంపై దృష్టి పెట్టింది. చివరకు మధ్యే మార్గంగా అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని, ఇరువర్గాలూ వాడకుండా తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామాన్ని ఊహించని శశికళ వర్గం కుదేలైపోయింది. టోపీ గుర్తుపై పోటీ చేయడం ద్వారా ప్రజల నుంచి నిరసన సెగలను ఎదుర్కొంది. రెండాకుల చిహ్నం స్థానంలో డబ్బును వెదజల్లడం ద్వారా గెలుపొందాలని దినకరన్‌ చేసిన ప్రయత్నం మొత్తం ఎన్నికల రద్దుకే దారితీసింది.

ఇక లాభం లేదనుకున్న దినకరన్‌ రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవడం కోసం రూ.50 కోట్లు ఎరవేసేందుకు ప్రయత్నించి ఢిల్లీ పోలీసులకు చిక్కారు. పార్టీ, చిహ్నంపై ఎన్నికల కమిషన్‌ ఢిల్లీలో ఈనెల 17న విచారణకు సిద్ధమవుతున్న తరుణంలోనే దినకరన్‌ ఉదంతం బట్టబయలై విచారణ వాయిదాకు దారితీసింది. అన్నాడీఎంకే వ్యవహారం ఎన్నికల కమిషన్‌కు తలనొప్పిగా మారగా వీలయినంత త్వరగా ఈ శిరోభారాన్ని దించుకునేందుకు సిద్ధమైంది.

చిహ్నం కోసం జూన్‌ 16వ తేదీలోగా అదనపు ఆధారాలను సమర్పించాల్సిందిగా అన్నాడీఎంకేలోని ఇరువర్గాలను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం ఆదేశించింది. విలీనం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎడపాడి, పన్నీర్‌వర్గాలకు ఆధారాలపై గడువు విధించడం ద్వారా ఎన్నికల కమిషన్‌ షాకిచ్చింది. ఇరువర్గాల నేతలు ఆధారాలతో ముందు కెళతారా, వీలీనానికి ప్రాధాన్యం ఇస్తారా లేకుంటే రెండాకుల చిహ్నాన్ని చేజార్చుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు