‘బీజేపీకి సంబంధం లేదు’

14 Feb, 2017 11:33 IST|Sakshi
‘బీజేపీకి సంబంధం లేదు’
ఢిల్లీ: తమిళనాడులో జరుగుతున్న సంక్షోభానికి, భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు బీజేపీ ఇంఛార్జ్‌ మురళీధర్‌ రావు తెలిపారు. శశికళ నటరాజన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి సుప్రీంకోర్టు తీర్పు క్లీన్‌ పాలిటిక్స్‌ దిశగా గొప్ప ముందడుగు అని వ్యాఖ్యానించారు. 
 
కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆరో నెంబరు కోర్టులో ఈ తీర్పు ఇచ్చింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న మరో ముగ్గురిని కూడా సర్వోన్నత న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అదేవిధంగా శశికళకు రూ.10 కోట్ల జరిమానా విధించింది.  ఈ నేపధ్యంలో వారం రోజులుగా తమిళనాడులో జరుగుతున్న రాజకీయ డ్రామాకు పూర్తిగా తెరపడినట్లయింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. తక్షణమే ఆమె లొంగిపోవాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.