గుర్తు పట్టాలని!

13 May, 2017 02:46 IST|Sakshi
గుర్తు పట్టాలని!

► రెండాకుల చిహ్నం కోసం మూడు పార్టీల పట్టు
► దీప పేరవై పేరు మార్పు
► ఈసీకి పన్నీర్‌ వర్గం ప్రమాణపత్రాల సమర్పణ


అన్నాడీఎంకేకు ఆయువు పట్టు రెండాకుల చిహ్నం. ఈ గుర్తుకోసం మూడు పార్టీలు పోరుబాట పట్టాయి. శశికళ వర్గం ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ వద్ద తన వాదన వినిపించింది. ఇప్పుడు పార్టీ పేరు మార్పుతో దీప, ఈసీకి ప్రమాణపత్రాల సమర్పణతో పన్నీర్‌సెల్వం రెండాకుల గుర్తు దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత గత ఏడాది కన్నుమూసిన కొద్దిరోజుల్లోనే రెండాకుల పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకేకు అసలైన వారసులం తామంటే తామని శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాల ప్రకటించుకోగా ఎవ్వరూ కాదు పొమ్మంటూ ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నంపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ పరిణామంతో విస్తుపోయిన ఇరువర్గాలు రెండు పార్టీలు పెట్టుకున్నాయి. శశికళ వర్గం తమ పార్టీకి ‘అన్నాడీంకే అమ్మ’ (టోపీ గుర్తు), పన్నీర్‌ వర్గం ‘అన్నాడీఎంకే పురట్చితలైవీ అమ్మ’ (రెండు దీపాల విద్యుత్‌ స్తంభం గుర్తు) అని నామకరణం చేసుకుని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో తలపడ్డాయి.

అయితే అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం లేకుండా నెగ్గుకు రావడం కష్టమని కొద్దిరోజుల్లోనే ఇరు వర్గాలకూ తెలిసిపోయింది. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్‌ ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం లేని లోటును డబ్బుతో అధిగమించేందుకు ప్రయత్నించి అభాసుపాలు కావడంతోపాటు ఎన్నికల రద్దు కారకుడయ్యాడు. అంతేగాక రెండాకుల చిహ్నంను దొడ్డిదారిన దక్కించుకునేందుకు ఏకంగా ఎన్నికల కమిషన్‌కే రూ.50 కోట్ల ఎరవేసి జైలు పాలయ్యాడు.

రెండాకుల కోసం మూడు పార్టీల పోరు
ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్‌ చేతిలో ఉన్న అన్నాడీఎంకేను, రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నాలను మానివేసి పార్టీ క్యాడర్‌ బలం ద్వారా పొందాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. ప్రస్తుతం పార్టీ, మెజార్టీ ఎమ్మెల్యేల బలం ప్రభుత్వం తమ చేతుల్లో ఉందనే ధీమాతో ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే అనేక పత్రాలను సమర్పించిన శశికళ వర్గం నింపాదిగా వ్యవహరిస్తోంది.

పన్నీర్‌ వర్గం ప్రమాణ పత్రాల సమర్పణ: ఇక పన్నీర్‌సెల్వం వర్గం సైతం ఎన్నికల కమిషన్‌నే నమ్ముకుంది. అమ్మ పార్టీకి అసలైన వారసులం అంటూ గతంలో 20 వేల పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించింది. ఇందుకు అదనంగా శుక్రవారం 12,600 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాలను అందజేసింది. పన్నీర్‌సెల్వం నాయకత్వాన్ని తాము సమర్థిస్తున్నామంటూ పార్టీ నేతలు, సభ్యుల సంతకాలతో కూడిన ప్రమాణ పత్రాలు అందులో ఉన్నాయి. ఇరువర్గాల పత్రాలను ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తోంది.

పేరు మార్చుకున్న దీప పేరవై: రెండాకుల చిహ్నం కోసం శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీ పడుతుండగా జయలలిత అన్నకుమార్తె దీప సైతం రంగంలోకి దిగారు. అమ్మకు రక్తసంబంధీకులమేకాదు, రాజకీయ వారసురాలిని కూడా నేనే అంటూ ఎంజీఆర్‌ ‘అమ్మ దీప పేరవై’ పేరుతో జనం ముందుకు వచ్చారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడమే తన లక్ష్యమని ప్రకటించారు.

ఆర్కేనగర్‌ ఎన్నికల్లో సైతం పేరవై పేరుతో పోటీచేసిన దీప... రెండాకుల చిహ్నం రేసులో ఉరికేందుకు తాజాగా తన పార్టీ పేరును మార్చారు. పేరవై ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రుమాన పాండియన్‌ అధ్యక్షతన నిర్వాహకులతో శుక్రవారం సమావేశమై పలు తీర్మానాలు చేశారు. ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవైని రద్దు చేసి ‘అన్నాడీఎంకే దీప’ వర్గంగా మార్చడం తీర్మానాల్లో ప్రధానమైనది.

మరిన్ని వార్తలు