అమ్మ కోసం యూగం

7 Oct, 2014 00:11 IST|Sakshi
అమ్మ కోసం యూగం

 చెన్నై, సాక్షి ప్రతినిధి: అమ్మకు జైలు శిక్షపడి సోమవారానికి పదిరోజులు పూర్తయింది. అమ్మ దర్శనానికి నోచుకోక అన్నాడీఎంకే నేతలంతా తల్లడిల్లిపోతున్నారు. పార్టీలోని వారు విభాగాల వారీగా, విడతల వారీగా ప్రతిరోజు ఆందోళనలు చేపడుతున్నారు. ముగ్గురు మంత్రులు సోమవారం వేర్వేరుగా పూజలు, యాగా లు నిర్వహించారు. మంత్రి వలర్మతి మాంగాడు అమ్మన్ ఆలయంలో 108 కలశాలతో యాగాన్ని, ప్రత్యేక పూజను నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి సైదాపేటలోని ఇళంగాళీ అమ్మన్ ఆలయానికి చేరకున్నారు.
 
 చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరస్వామి తదితరులతో కలిసి ప్రార్థనలు జరిపారు. పూజ అనంతరం ఆలయం నుంచి నిప్పుల కుండను చేతబట్టి నగర రోడ్లపై నడిచారు. అలాగే మంత్రి గోకుల ఇందిర తలపై పాలబిందెను పెట్టుకుని ఊరేగింపుగా ఉదయం 10 గంటలకు వడపళని మురుగన్ ఆలయానికి చేరుకున్నారు. ఆమెతోపాటూ వెంట నడిచిన వేలాది మంది మహిళలు సైతం 1008 పాలబిందెలతో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఇక్కడి పూజలు పూర్తి చేసుకున్న అనంతరం పరశువాక్కంలోని పాతాళ పొన్నయమ్మన్ ఆలయంలో గోకుల ఇందిర అగ్నిగుండం వేసి రెండు గంటల పాటూ యాగం నిర్వహించారు. శోళింగనల్లూరులోని పళనిమమ్మాన్ ఆలయంలో మంత్రి కేఎం చిన్నయ్య 1008 మంత్రాలతో అర్చన, యాగం చేశారు.
 
 140 కిలోమీటర్ల మానవహారం: నాగపట్నం జిల్లాలో 140 కిలోమీటర్ల పొడవునా మానవహారం నిర్మించి రికార్డు సృష్టించారు. ఇందులో 10 వేల మంది పాల్గొన్నారు. రామాపురంలో సైతం మానవహారం నిర్వహించారు. అన్నాడీఎంకే అనుబంధ శాఖలకు చెందిన నేతలు బీచ్‌రోడ్డులోని ఎంజీఆర్ సమాధి వద్ద నల్లచొక్కాలు ధరించి, అమ్మ ఫొటోలు చేతబూని నిరాహారదీక్ష నిర్వహించారు. తిరువాన్మియూర్ మరుందీశ్వర్, ఉత్తాండి  నాగత్తమ్మన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పాడి శివన్ ఆలయంలో యాగం చేశారు. పల్లికరనై ఓడియంపాక్కంలో నిరాహారదీక్షలు చేపట్టారు. చెన్నై కార్పొరేషన్ 168 వార్డు కౌన్సిలర్ నాయకత్వంలో నల్లచొక్కాలుధరించి,కళ్లకు నల్లగంతలుకట్టుకుని ర్యాలీ నిర్వహించారు. నీలగిరి జిల్లాలో సోమవారం దుకాణాలు మూసివేశారు. మినీ బస్సులను నిలిపివేశారు.
 
 నేడు కోయంబేడు మార్కెట్ బంద్: నగరంలో ని కోయంబేడు మార్కెట్‌వారు మంగళవారం బంద్ పాటిస్తున్నారు. మార్కెట్‌లోని దుకాణలన్నింటినీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేస్తున్నట్లు వ్యాపారస్తులు ప్రకటించారు. అలాగే ఆమ్నీ బస్సు యూజమాన్యాల సంఘం సైతం మంగళవారం బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బస్సులు నడపబోమని చెప్పింది.
 
 ఇద్దరు మృతి: అమ్మకోసం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అమ్మ జైలుపాలైన నాటి నుంచి ఆవేదనతో గడుపుతున్న కోయంబత్తూరుకు చెందిన మీసం చిన్ను (50) సోమవారం నిర్వహించే మానవహారంలో పాల్గొనేందుకు బయలుదేరిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మృతి చెందాడు. చేపల వ్యాపారం నిర్వహించే మదురైకు చెందిన వీరపుష్పం (35) అనే మహిళ జయకు జైలు శిక్ష పడిన నాటి నుండి వ్యాపారానికి వెళ్లకుండా ఇంటి వద్దనే రోదిస్తూ గడిపేది. సోమవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.  
 

మరిన్ని వార్తలు