‘ఎయిడ్స్’ ర్యాలీలో మిస్ యూనివర్స్

30 Sep, 2013 02:50 IST|Sakshi
న్యూఢిల్లీ: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, బాధితులకు సాయం చేసేందుకు ‘వాక్ ఫర్ లైఫ్’ పేరుతో నగరంలో ఆదివారం నిర్వహించిన ర్యాలీకి మిస్ యూనివర్స్ 2012 ఒలీవియా ఫ్రాన్సిస్ కల్పో హాజరయింది. ఇండియాగేటు వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించింది. మొదటిసారిగా భారత్‌కు వచ్చిన కల్పో శుక్రవారం కూడా గుర్గావ్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. ‘ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముంది. 
 
 ముఖ్యంగా యువత  అవగాహన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలి. ఈ వ్యాధితో వచ్చే ఇబ్బందులను వివరించాలి’ అని ఆమె ఈ సందర్భంగా చెప్పింది. హెచ్‌ఐవీ బాధితులపై చిన్నచూపు చూసే దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఈ 21 ఏళ్ల బ్యూటీ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరింది. నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు, యువత ఇందులో పాల్గొన్నారు. అమెరికాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వ్యాధి అవగాహన కార్యక్రమాల్లో కల్పో చురుగ్గా పాల్గొంటోంది.
 
 భారత్‌లో బాలికా శిశుసంరక్షణ, మహిళా సాధికారత, ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన వంటి వాటిపై ప్రచారం చేయడానికి ఈ అమెరికన్ యువతి పది రోజులపాటు భారత్‌లో పర్యటించనుంది. పాలమ్‌విహార్‌లోని సులభ్‌గ్రామ్‌ను కూడా కల్పో శనివారం సందర్శించడం తెలిసిందే. పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసే పలువురు మహిళలతో రెండు గంటలసేపు ఈమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. లింగ, కుల వివక్ష నిర్మూలనకు గట్టి ప్రయత్నాలు జరగాలని ఆకాంక్షించింది. లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ముంబైలో జరిగే కార్యక్రమాల్లోనూ కల్పో పాల్గొననుంది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నాడు.  
 
మరిన్ని వార్తలు