ఆకాశంలో ఐదు గంటలు

13 Oct, 2018 10:54 IST|Sakshi

దుబాయ్‌ విమానానికి తప్పిన పెనుముప్పు

130 మంది ప్రయాణికుల గుండెల్లో గుభేల్‌

ఎట్టకేలకూ దుబాయ్‌ కథ సుఖాంతం

తాము ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. దీంతో మనకొద్దు అని దిగివెళ్లిపోయే వీలులేదు. ఎందుకంటే వారంతా ప్రయాణిస్తున్నది ఆకాశంలో. తమకు తాముగా భూమిపై కాలుపెట్టే పరిస్థితి లేదు. అంతా పైలట్‌ దయాదాక్షిణ్యాలపై అధారపడి ఉం ది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఐదు గంటలపాటు ఆకాశంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు తిరుచ్చి–
దుబాయ్‌ విమాన ప్రయాణికులు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై:  తిరుచ్చిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా విమానం ప్రతిరోజూ దుబాయ్‌లో బయలుదేరి రాత్రి 12.05 గంటలకు తిరుచ్చిరాపపల్లికి చేరుకుంటుంది. మరలా ప్రయాణికులను ఎక్కించుకుని దుబాయ్‌కి బయలుదేరుతుంది. యథావిధిగా గురువారం రాత్రి 120 మంది ప్రయాణికులతో దుబాయ్‌ నుంచి తిరుచ్చి చేరుకుంది. తిరుచ్చిలో 130 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో శుక్రవారం తెల్లవారుజాము 1.20 గంటలకు దుబాయ్‌కి బయలుదేరింది. కంట్రోలు రూం ఆదేశాల ప్రకారం తిరుచ్చి–పుదుక్కోట్టై రోడ్డు ప్రహరీగోడ వైపున పశ్చిమ దిశగా టేకాఫ్‌ తీసుకోవడానికి ముందు రన్‌వేలోనే తూర్పు దిశకు వెళ్లి మరల పశ్చిమ దిశకు మరల్చి రన్‌వేలో సగం దూరం వేగంగా నడిపి టేకాఫ్‌ తీసుకోవాలి. 

అయితే సదరు విమానం రన్‌వే ముగిసేచోట టేకాఫ్‌ చేయడంతో అక్కడి పదకొండు టవర్లలో నాలుగింటిని ఢీకొట్టింది. అదే తీరులో ముందుకు ఎగురుతుండగా విమానం వెనుకనున్న రెండుచక్రాలు 9 అడుగుల ప్రహరీగోడను ఢీకొట్టాయి. ఈ కారణంగా ప్రహరీగోడ పాక్షికంగానూ, టవర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే విమాన కిందిభాగం ధ్వంసమై కొన్ని శిథిలాలు కిందపడిపోయినట్లు సమాచారం. అయితే విమాన రెండుచక్రాలకు ఏమీకాలేదు. ఇంత జరిగినా ఏమాత్రం చలించని పైలట్‌ విఘ్నేష్‌కుమార్‌ దుబాయ్‌ వైపు విమానాన్ని పరుగులు పెట్టించాడు. విమానం భారీగా కుదుపులకు లోనుకావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

 ఏమైందని ప్రశ్నిస్తే ఎయిర్‌హోస్టెస్‌ ఏదో సర్దిచెప్పారు. విమాన విధ్వంస దృశ్యాలను సీసీ కెమెరాల్లో చేసిన తిరుచ్చి కంట్రోలు రూంఅధికారులు పైలట్‌ను సంప్రదించగా విమానానికి ఏమీ కాలేదు, దుబాయ్‌ వెళుతున్నా అని బదులిచ్చాడు. విమానం స్వల్ప ప్రమాదానికి లోనైందని తిరుచ్చి కంట్రోలు రూం అధికారులు దుబాయ్‌ కంట్రోలు రూంకు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ ల్యాండ్‌ అయ్యేందుకు వీలులేదు, మరేదైనా జరిగితే మాకు తలనొప్పని వారు స్పష్టం చేశారు. దీంతో తిరుచ్చి అధికారులు ముంబయి విమానాశ్రయ కంట్రోలు రూంను సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి పొందారు. దీంతో ఏమైందో తెలియక ముంబయి విమానాశ్రయంలో కలకలం రేగింది.

 తిరుచ్చి అధికారులు పైలట్‌కు ఫోన్‌ చేసి వెంటనే ముంబయి విమానాశ్రయంలో దిగాల్సిందిగా ఆదేశించారు. అప్పటికే విమానం దుబాయ్‌ దేశంలో సముద్రంపై ఎగురుతోంది. ఈ విమానం దుబాయ్‌కి మరో 45 నిమిషాల్లో చేరుతామనగా వెనక్కుమళ్లి శుక్రవారం ఉదయం 6.10 గంటలకు ముంబయి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. దుబాయ్‌ విమానం లాండ్‌ అయ్యేవరకు ముంబయి, తిరుచ్చి కంట్రోలు రూం అధికారులు, ప్రయాణికులు తీవ్ర ఉత్కంఠ పరిస్థితిని ఎదుర్కొన్నారు. దుబాయ్‌ విమానంలోని 130 మంది ప్రయాణికులకు బస ఏర్పాటు చేసి ఉదయం 10.40 గంటలకు మరో విమానంలో పంపారు.

రుజువైతే లైసెన్సు రద్దు:  
తిరుచ్చి విమానాశ్రయ అధికారి గుణశేఖరన్‌ మీడియాతో మాట్లాడుతూ విమానం టవర్‌కు ఢీకొనగానే కంట్రోలు రూంలో అలారం వినిపించిందని అన్నారు. దీంతో పైలట్‌ను ఫోన్‌లో సంప్రదించగా విమానానికి ఏమీ కాలేదని బదులిచ్చాడు. ముంబయిలో అత్యవసర లాండింగ్‌ చేయాలని ఆదేశించామని తెలిపారు. ఈ సంఘటనపై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ విచారణకు ఆదేశించిందని, ఈ విచారణ బృందంలో తాను సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. పైలెట్‌ తప్పిదం ఉన్నట్టు విచారణలో తేలితే అతడి లైసెన్సును రద్దు చేస్తామని తెలిపారు. అదే జరిగి ఉంటే.. విమానాశ్రయానికి అనుకునే తిరుచ్చిరాపల్లి–పుదుక్కోట్టై రహదారిని నిర్మించారు. ఈ రహదారిలో 24 గంటలు పెద్ద సంఖ్యలో వాహనాల రద్దీ ఉంటుంది. ఐదు నిమిషాలకు ఒకసారి పుదుక్కోట్టై బస్సు వెళుతుంటుంది. ప్రహరీని ఢీకొన్న సమయంలో ఏదైనా వాహనం వెళుతుండినట్లయితే విమానం ముందు భాగం సదరు వాహనాన్ని ఢీకొని పెద్ద ప్రమాదం చోటుచేసుకుని ఉండేది. అదృష్టవశాత్తు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు