వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోండి

1 Apr, 2015 02:52 IST|Sakshi

రాష్ట్రప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
     పర్యావరణంపై అవగాహనకు జాతీయ వాయు నాణ్యత సూచిక
     త్వరలో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో ఏర్పాటు
     కాలుష్యంపై పోరాటం నిరంతర ప్రక్రియ
 
 న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో రోజురోజుకి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీని కోసం కేంద్రం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. దేశ రాజధాని నగరంలో పెరిగిపోతున్న కాలుష్యంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో మూడు సార్లు సమావేశం నిర్వహించామని చెప్పారు. ఈ సమావేశాల్లో ఘన రూపంలోని చెత్త, కాలుష్య నియంత్రణ, ధూళి కణాల పెరుగుదలపై పర్యవేక్షణ, మురుగునీటి నిర్వహణ తదితర అంశాల గురించి చర్చించామని తెలిపారు.
 
 వీటికి సంబంధించి ‘యాక్షన్ ప్లాన్’ను మార్చి 31లోగా సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో చెప్పిందన్నారు.  కానీ ఇంతవరకు ఎలాంటి నివేదిక తమకు అందలేదని, దాని కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, వీలైనంత త్వరగా వారు ప్రణాళిక తయారు చేసుకుని రావాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో ఎక్కడ చూసిన కుప్పలుగా పేరుకుపోయిన చెత్త దర్శనమిస్తోందని, అలాగే మురుగునీరు పోవడానికి కూడా సరైన వ్యవస్థ లేదని ఆయన పేర్కొన్నారు. ఎంత త్వరగా ప్రణాళిక తయారు చేసుకుని వస్తే అంతే వేగంగా సమస్యను పరిష్యరించేందుకు అవకాశముందని చెప్పారు. ఢిల్లీలో ఈ స్థాయిలో కాలుష్యం పెరగడానికి పొరుగు రాష్ట్రాలు కూడా ఓ కారణమని వ్యాఖ్యానించారు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి డీజిల్, పెట్రోల్ వంటి వాహనాల్లో వచ్చే వారి సంఖ్య పెరిగిపోవడం వల్ల దుమ్మూ ధూళి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయిందని జవదేకర్ చెప్పారు.
 
 చీపుర్లతో కాదు...
 నగరంలోని రోడ్లను చీపుర్లతో కాకుండా యంత్రాలతో శుభ్రం చేయించాలని సూచించారు. వాయు కాలుష్యం మూలంగా నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పొగమంచు దట్టంగా అలుముకుంటోందని, తద్వారా తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్యలన్నింటికి సమాధానంగా ‘జాతీయ వాయు నాణ్యత సూచిక’ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో వాయు నాణ్యతపై అవగాహన కల్పిస్తూ, వారిని కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు చేసేందుకు త్వరలో దేశంలోని 10 నగరాల్లో దీనిని ప్రారంభిస్తామని వెల్లడించారు.
 
 ఆ 10 నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటని పేర్కొన్నారు. ఈ సూచిక వల్ల ప్రజలకు వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తేలికగా అర్థమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ముందుగా ఈ విధానాన్ని దేశంలోని 10 నగరాల్లో ప్రారంభిస్తాం. రానున్న కాలంలో మరో 20 రాష్ట్రాల రాజధానుల్లో, 46 నగరాల్లో దీనిని విస్తరిస్తామని చెప్పారు. దీని ద్వారా ప్రజల ఆలోచనా విధానంలో తప్పక మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ కాలుష్యంపై పోరాడాల్సిన అవసరముందని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యావరణ మంత్రులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు