ఎయిర్ షో ఇక్కడే

19 Feb, 2015 01:30 IST|Sakshi

మరో ప్రాంతానికి మార్చం
కేంద్ర మంత్రి మనోహర్ పారికర్

 
బెంగళూరు :  ఎయిర్ షోను బెంగళూరు నుంచి మరో ప్రాంతానికి మార్చే యోచన ఏదీ లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఎరో ఇండియా-17 కూడా బెంగళూరులోనే జరుగుతుందని ఆయన తేల్చి చెప్పారు. ఎరో ఇండియా-17 ప్రదర్శనను యలహంకలోని వైమానిక స్థావరంలో బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రదర్శనను గోవాకు మార్చాలని తొలుత భావించినట్లు చెప్పారు. అయితే ఇక్కడకు వచ్చి పరిశీలించిన తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రదర్శనకు వచ్చిన విమానాలు, కంపెనీల కంటే రెట్టింపు సంఖ్యలో లోహవిహంగాలు, సంస్థలు తమ స్టాల్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడానికి సరిపడ స్థలం ఉండడమే ఇందుకు కారణమని అన్నారు.  అత్యాధునిక (ఫోర్త్ జనరేషన్) రఫెల్ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే ప్రక్రియకు సంబంధించి వచ్చేనెలలోపు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

రక్షణ రంగంలోనే కాక ప్రైవేటు రంగంలో కూడా హెలికాప్టర్ల ఆవస్యకత ఎక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలకు గాను వెయ్యి హెలికాప్టర్లు కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా రక్షణ రంగ వస్తువుల తయారీలో ప్రైవేటు కంపెనీలు కూడా పాలుపంచుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ భారత దేశానికి అత్యాధునిక హెలికాప్టర్లను అందిస్తోందని ప్రసంశించారు. ఈ సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
 
 

>
మరిన్ని వార్తలు