బంగారం స్మగ్లింగ్ కేసులో ఎయిర్‌పోర్ట్ అధికారి అరెస్టు

5 Dec, 2014 22:31 IST|Sakshi

ముంబై: మూడు వేర్వేరు బంగారం స్మగ్లింగ్ కేసుల్లో నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ అధికారి సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. సుమారు రూ.1.16 లక్షల విలువైన బంగారాన్ని వీరినుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. కస్టమ్స్ కమిషనర్ ఏపీఎస్ సూరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  షార్జా నుంచి వచ్చిన షహబాజ్ ఖాన్ రూ.39.58 లక్షల విలువైన 1.62 కేజీల బరువున్న 14 బంగారం కడ్డీలను శుక్రవారం తన వెంట తీసుకువచ్చాడు.

సదరు బంగారాన్ని అతడు ఏరోబ్రిడ్జి వద్ద జగదీష్ బాబుకు అందజేశాడు. అనంతరం ఆ కడ్డీలను ఎయిర్‌పోర్ట్ బయట వేచి ఉన్న షేక్ మొహిసిన్‌కు బాబు అందజేస్తుండగా కస్టమ్స్ అధికారులు వలపన్ని ముగ్గురినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ సూరి మాట్లాడుతూ.. గత కొంతకాలంగా జగదీష్ బాబు బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్‌లకు సహాయపడుతున్నాడని తమకు అందిన సమాచారం మేరకు అతడిపై నిఘా పెట్టామన్నారు. విమానాశ్రయం నుంచి అక్రమ బంగారాన్ని క్షేమంగా బయటకు తీసుకువెళ్లి సదరు గ్యాంగ్‌కు అందజేసినందుకుగాను బాబుకు కేజీ బంగారానికి రూ.30 వేలు కమిషన్ ముడుతుందని ఆయన చెప్పారు. గత ఐదు నెలల కాలంలో బాబు ఇలా సుమారు 8,9 సార్లు దొంగ బంగారాన్ని విమానాశ్రయం నుంచి బయటకు క్షేమంగా బయటకు తరలించాడని సూరి చెప్పారు.

అలాగే మరో కేసులో దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన మహ్మద్ చెర్కల మూసా అనే ప్రయాణికుడి వద్ద శుక్రవారం రెండు కిలోల బరువైన దొంగ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని సూరి వివరించారు. దాని విలువ రూ.48.5 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. మూడో కేసులో.. అబుదాబి నుంచి గురువారం ముంబై చేరుకున్న నదియా ముబిన్ బాగ్దాది నుంచి సుమారు రూ.28.5 లక్షల విలువైన 10 బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు