డిస్కంల డిమాండ్‌కు తలొగ్గద్దు

21 Apr, 2015 04:55 IST|Sakshi

ప్రభుత్వానికి డీపీసీసీ అధ్యక్షుడు మాకెన్ లేఖ
 న్యూఢిల్లీ: విద్యుత్ సుంకం 20 శాతం పెంచాలని డిస్కంలు కోరడం సమంజసం కాదని, వారి డిమాండ్‌కు లొంగవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. డిస్కంల కోరిక అసమంజసం మాత్రమే కాదని, వారి ఇష్టానుసారం ప్రభుత్వం నడుచుకుంటే అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులపై పెను భారం పడుతుందని చెప్పింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాసినట్లు డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ తెలిపారు. ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునేలా ఢిల్లీ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్(డీఈఆర్‌సీ)కు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 90 శాతం మంది ఢిల్లీ ప్రజలు విద్యుత్ సబ్సిడీ పొందుతున్నారని చెప్పడం ద్వారా ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతుందని విమర్శించారు. ప్రొఫైలింగ్ వినియోగదారులెవరూ లేకుండా ఆ విధంగా ఎలా చెప్పగలుతారని ప్రశ్నించింది. ప్రజా సొమ్మును విద్యుత్ సంస్థలు దుర్వినియోగపరుస్తున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా కుటుంబానికి ఓ విద్యుత్ మీటర్‌ను అందించాలని ఏప్రిల్ 17న డీఈఆర్‌సీ కార్యదర్శి ముందు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విధంగా చేయడం వల్ల 50 శాతం సబ్సిడీపై నెలకు 400 యూనిట్ల వరకు వినియోగించుకునే విద్యుత్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందని ఆ పిటిషన్‌లో పేర్కొంది.
 

మరిన్ని వార్తలు