అజిత్ సరసన శ్రుతిహాసన్

1 May, 2015 03:11 IST|Sakshi
అజిత్ సరసన శ్రుతిహాసన్

 ఎన్నై అరిందాల్ చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అజిత్ తాజా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఆయనతో ఆరంభం, ఎన్నై అరిందాల్ వంటి భారీ విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీ సాయిరామ్ ఫిలింస్ అధినేత ఎ ఎం రత్నం ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుందని సమాచారం. ఈ చిత్రానికి అచ్చమిల్లై అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.
 
 అజిత్ సరసన శ్రుతిహాసన్ నటించనున్న ఈ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటి లక్ష్మీమీనన్ నటించనున్నారు. ఇంతకుముందు అజిత్ హీరోగా వీరం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలు అందిస్తున్నారు. ఇటీవల ఆయన ఈ చిత్రం కోసం ఒక థీమ్ మ్యూజిక్‌ను సమకూర్చారట. అది చిత్ర దర్శకుడు శివకు విపరీతంగా నచ్చేసిందట.
 
 ఈ ఏడాది సూపర్‌సాంగ్ ఇదేనంటూ అనిరుధ్‌ను ప్రశంసలతో ముంచేస్తున్నారట. ఈ చిత్రంలో సంతానం, తంబిరామయ్య, సూరి ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. అచ్చమిల్లై అంటే భయం లేదు అని అర్థం. ఈ టైటిల్ సహా పూర్తివివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారిక పూర్వకంగా వెల్లడించనున్నట్లు సమాచారం. కాగా ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్‌కు వారసుడు పుట్టిన సంతోషం కూడా తోడవ్వడంతో శుక్రవారం తన పుట్టిన రోజు విజయోత్సాహం, పుత్రోత్సాహంతో జరుపుకుంటున్నారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు