నైవేద్యంగా మద్యం బాటిళ్లు

23 Jan, 2018 07:04 IST|Sakshi
పూజలు చేస్తున్న చిన్నారులు

మదురై వీరన్‌స్వామికి అర్పించిన చిన్నారులు

మద్యం సేవించరాదని, వర్షం కురవాలని ప్రార్థనలు..

అన్నానగర్‌: వర్షం కురవాలని, కన్నవారు మద్యం సేవించకూడదని మదురై వీరన్‌స్వామికి మద్యం బాటిళ్లను పెట్టి చిన్నారులు ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా గ్రామంలో ఎవరూ మద్యం తాగకూడదని కన్నవారి కాళ్లకు నమస్కరించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దిండుక్కల్‌ జిల్లా వేడచందూర్‌ సమీపంలోని ఇ.చిత్తూర్‌లో మదురైవీరన్‌ ఆలయం ఉంది. ఇక్కడ పూర్తిగా కూలీలే నివసిస్తూ వస్తున్నారు. ఇక్కడ కొన్నేళ్లుగా వర్షం కురవడంలేదు. మద్యానికి బానిసలై పలువురు దీనస్థితిలో ఉన్నారు.

ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన చిన్నారులు, వర్షం కురవాలని, ఎవరు మద్యం సేవించకూడదని వారి కులదైవం మదురైవీరన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకోసం చిన్నారులు చందాలు సేకరించారు. ఆదివారం మేళ, తాళాలతో మద్యం బాటిళ్లు, పూజా వస్తువులను చిన్నారులు ఊరేగింపుతో ఆలయానికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లను మదురైవీరన్‌కి నైవేద్యంగా పెట్టారు. పొంగలి పెట్టి పూజలు చేశారు. నైవేద్యంగా పెట్టిన మద్యం బాటిళ్లను ఆలయం ముందు పోసి ఎవరు మద్యం సేవించకూడదని, వర్షం కురవాలని చిన్నారులు ప్రార్థించారు. తరువాత కన్నవారి కాళ్ల మీద పడి నమస్కరించారు.

మరిన్ని వార్తలు