సరిహద్దుల్లో కూంబింగ్

23 Dec, 2014 01:56 IST|Sakshi
సరిహద్దుల్లో కూంబింగ్

 సాక్షి, చెన్నై:తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో మావోయిస్టులు పంజా విసిరారు. తమ ఉనికిని చాటుకునే రీతిలో అటవీ కార్యాలయంపై ప్రతాపం చూపించారు. ఈ దాడితో సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోకి  మావోయిస్టులు చొరబడకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని పశ్చిమ పర్వత శ్రేణుల్లో మావోల జాడతో కూంబింగ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. 2008లో దిండుగల్ జిల్లా  కొడెకైనాల్లో జరిగిన ఎన్ కౌంటర్‌లో మావోయిస్టుల నేత నవీన్ ప్రసాద్ హతం అయ్యాడు. ఈ ఘటనతో రాష్ట్రంలో మావోలు పత్తా లేకుండా పోయారు. తరచూ మాజీ మావోరుుస్టులు పోలీసులకు చిక్కుతున్నా, వారి కదలికలు మాత్రం పూర్తిగా తగ్గాయి. ఇదే విషయాన్ని పోలీసు యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే, ఇటీవల సరిహద్దు అడవుల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్టుగా అటవీ గ్రామాల ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మావోలపై ఉక్కు పాదం మోపే రీతిలో పాలకులు చర్యలు తీసుకోవడంతో, అక్కడి నుంచి
 కొందరు తప్పించుకుని కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని పశ్చిమ పర్వత శ్రేణుల్లో నక్కి ఉన్నట్టుగా ఇటీవల విచారణలో వెలుగు చూసింది.
 
 అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పశ్చిమ పర్వత శ్రేణుల్లో ఆయుధాలతో సంచరిస్తున్నట్టుగా అటవీ గ్రామాల ప్రజలు పదే పదే అటవీ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో అటు కేరళ, ఇటు తమిళనాడు పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు.  పంజాతో అలర్ట్ : మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే  రీతిలో అటు కేరళ, ఇటు తమిళనాడు పోలీసుల్ని బెంబేలెత్తించే విధంగా పంజా విసిరారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ముక్కాలి అటవీ కార్యాలయాన్ని టార్గెట్ చేసి దాడులకు దిగడంతో కలకలం మొదలైంది. సోమవారం వేకువ జామున పదికి పైగా మావోరుుస్టులు ఆ కార్యాలయంపై దాడులు చేసి అక్కడున్న అన్ని వస్తువుల్ని ధ్వంసం చేయడంతో పాటుగా జీపుకు నిప్పు పెట్టారు. వెళ్తూ వెళ్తూ ఆదివాసీల కోసం తమ ఉద్యమం ఆరంభం అని పోస్టర్లను అంటించి వెళ్లడంతో కేరళ  పోలీసులతో పాటుగా తమిళనాడు పోలీసులు అప్రమత్తం అయ్యారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ కార్యాలయాన్ని మావోలు ఎంచుకున్న దృష్ట్యా, కేరళలోనైనా వాళ్లు నక్కి ఉండాలి, లేదా తమిళనాడులో నైనా ఆశ్రయం పొంది ఉండాలన్న అనుమానాలు వ్యక్తమయ్యూరుు.
 
 వేట ఆరంభం : రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా సరిహద్దులోని కేరళ భూభాగంలో ముక్కాలి అటవీ కార్యాలయం ఉండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అలర్ట్ ప్రకటించారు. కేరళ నుంచి తమిళనాడుకు వస్తున్న ప్రతి వాహనాన్ని రాష్ట్ర పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పశ్చిమ పర్వత శ్రేణుల్లో కూంబింగ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. క్యూ బ్రాంచ్, ఆయుధ బలగాలు రంగంలోకి దిగాయి. అటవీ గ్రామాల ప్రజలతో సంప్రదింపులు జరుపుతూ, అనుమానితులు ఎవరైనా కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించే పనిలో పడ్డారు. కేరళకు తమిళనాడు నుంచి కోయంబత్తూరు వైపుగా ఓ మార్గం, తేని మీదుగా మరో మార్గం, సెంగోట్టై మీదుగా , కన్యాకుమారి సముద్ర తీరం మీదుగా మార్గాలు ఉన్నాయి. దీంతో ఆయా మార్గాల్లోను చెక్ పోస్టుల్ని పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే, అయ్యప్ప భక్తులకు ఈ తనిఖీలు కాస్త ఆటంకాన్ని కలిగిస్తున్నారుు. అదే సమయంలో అయ్యప్ప దర్శనం ముగించుకుని తమిళనాడులోకి వ చ్చే భక్తులకు తంటాలు తప్పడం లేదు. అయ్యప్ప భక్తుల ముసుగులో మావోలు తప్పించుకోవచ్చన్న భావనతో ఈ తనిఖీలు చేస్తున్నారు.
 
 అప్రమత్తంగానే ఉన్నాం : ముక్కాలి అటవీ కార్యాలయానికి కూత వేటు దూరంలో పోలీసు క్వార్టర్స్ సైతం ఉన్నా, మావోల పథకాన్ని పసిగట్టలేక పోయారు. కోయంబత్తూరు ఎస్పీ సుధాకర్ మాట్లాడుతూ, కోయంబత్తూరు నుంచి కేరళకు వెళ్లే మార్గాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు తీవ్ర తరం చేశామన్నారు. తమిళ సరిహద్దుల్లోకి మావోలు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన నిఘాతో వ్యవహరిస్తున్నామన్నారు. అనైకట్టు పరిసరాల్లో భద్రతను ఏడింతలు పెంచామని వివరించారు. 

మరిన్ని వార్తలు