అసెంబ్లీపైనే పార్టీల గురి

24 May, 2014 22:35 IST|Sakshi

 సాక్షి, ముంబై:  ‘మిషన్-అసెంబ్లీ’ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీ లు సిద్ధమవుతున్నాయి. రోజురోజుకి మారుతున్న రాజకీయ పరి ణామాలపై దృష్టి కేంద్రీకరించిన అన్ని పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా మారడంతోపాటు ఐదు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహరచన చేస్తున్నాయి. సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. పార్టీలను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతోపాటు ప్రజాదరణ పొందేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని యోచిస్తున్నాయి. కొన్ని పార్టీలైతే అంతర్గత విభేదాలు, సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మార్పులు చేర్పులు చేపడుతున్నాయి.

 సీట్ల పంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇటు శివసేన, బీజేపీ, ఆర్‌పీఐ, స్వాభిమాని పార్టీల మహాకూటమితో పాటు కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమిలో విబేధాలున్నాయన్న సంగతి ఇప్పటికే పలుసందర్భాల్లో బహిర్గతమైంది. మహాకూటమి, డీఎఫ్ కూటములు పాత ఫార్ములాలతోనే కాకుండా అధిక స్థానాల కోసం ఎవరికివారు డిమాండ్ చేస్తున్నారు. మహాకూటమిలోని ఆర్‌పీఐ, స్వాభిమాని, శివసంగ్రామ్ తదితర పార్టీలకు  ఎన్ని సీట్లు కేటాయించాలనేది ఇంకా తేలలేదు.  అయి తే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కొంత సీన్ మారింది. మహాకూటమిలోని బీజేపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామంటే, అవేమీ కుదరవు పాత ఫార్ములా ప్రకారమే ముందుకెళ్లాలని శివసేన అంటోంది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాల ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యేవరకు ఇరు పార్టీల అధిష్టానాలకు తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది.

 పైచేయి కోసం పోటీ...
 మహాకూటమిలోని శివసేన, బీజేపీలు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఓవైపు శివసేన తన పట్టును నిలుపుకుని రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని చూస్తోంది. మరోవైపు బలం పెరిగిందని అంటున్న బీజేపీ  ఎలాగైన ఈసారి అధిక స్థానాలు దక్కించుకుని సీఎం పీఠం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం అత్యధిక లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, అత్యధిక అసెంబ్లీ సీట్లలో శివసేన పోటీ చేస్తూ వస్తున్నాయి.  దీంతో 1995లో కేంద్రంలో బీజేపీకి ప్రధాని పదవి లభించగా, రాష్ట్రంలో శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభించింది. అయితే గత ఎన్నికల్లో ఈ సీన్ మారింది.

2009లో శివసేన 160 అసెంబ్లీ సీట్లు, బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేసింది. అయితే శివసేన కేవలం 44 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ మాత్రం 46 స్థానాల్లో గెలిచింది. దీంతో అధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ప్రతిపక్షహోదా మాత్రం దక్కింది. అయితే ఈసారి మళ్లీ లోక్‌సభ ఫలితాల అనంతరం ఎంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధిక అసెంబ్లీ స్థానాలు కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో బీజేపీలో అప్పుడే ముఖ్యమంత్రి ఎవరవుతారనే చర్చలు ప్రారంభమైనట్టు సమాచారం. మరోవైపు శివసేన మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అధిక స్థానాలు ఇచ్చేది లేదని, తమకే ఎక్కువ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో సీట్ల పంపకాలపై మహాకూటమిలో కూడా విభేదాలు ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

 డీఎఫ్ కూటమిలోనూ విభేదాలు...
 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ప్రజాస్వామ్య కూటమి(డీఎఫ్)లో ఆందోళనతోపాటు అసంతృప్తి కన్పిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అసెంబ్లీ పోరులో విజయం సాధించి రాష్ట్రంలో తమ పట్టును నిలుపుకునేందుకు డీఎఫ్ కూటమి ప్రయత్నిస్తోంది. అయితే సీట్ల పంపకాల విషయంలో మాత్రం వీరి మధ్య ఈసారి కూడా విభేదాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయంపై ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. మీ వల్లే మా పార్టీ ఓడిపోయిందంటే మీ వల్లేనని విమర్శించుకుంటున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా అసెంబ్లీలో ఈసారి అధి క స్థానాలు కావాలని కాంగ్రెస్, ఎన్సీపీలు డిమాండ్ చేస్తున్నాయి.

అధిక స్థానాలు కేటాయించాలని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అంటున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 169 స్థానాల్లో, ఎన్సీపీ 114 స్థానాల్లో పోటీ చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 82, ఎన్సీపీ 62 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే ఈసారి రాష్ట్రంలో పట్టును నిలుపుకోవాలంటే అధిక స్థానాలు కావాలని ఇరు పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య సీట్ల పంపకాల విషయం తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి.  

 దూకుడు పెంచాలనుకుంటున్న ఎమ్మెన్నెస్
 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కూడా అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల జరిగిన ఓటమిపై సమీక్ష నిర్వహించిన ఆ పార్టీ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలన్న దానిపై కూడా చర్చించింది. పార్టీ సీఎం అభ్యర్థిగా రాజ్‌ఠాక్రే పేరును ప్రతిపాదిస్తూ ఆ సమావేశంలో ఏకగ్రీవ తీర్మా నం చేశారు. అయితే దీనిపై రాజ్‌ఠాక్రే ఎలా స్పందిస్తారోనని ఆ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ మొత్తం 143 స్థానాల్లో పోటీ చేసింది.

తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన రాజ్‌ఠాక్రే పార్టీ 13 స్థానాలు కైవసం చేసుకోవడంతోపాటు పలు స్థానాల్లో రెండు, మూడు స్థానాలను దక్కించుకుంది. ఈ ఫలితాలతో మంచి ఉత్సాహంలో ఉన్న ఎమ్మెన్నెస్‌కి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవకపోయిన పోటీ చేసిన 13 స్థానాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. అయితే ఈసారి పది లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన ఎమ్మెన్నెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు.

ఈ ఫలితాలతో నిరాశలో ఉన్న పార్టీ కార్యకర్తలు, పదాధికారుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు రాజ్‌ఠాక్రేతోపాటు పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రాజ్‌ఠాక్రే అనేక ప్రాంతాల్లో పర్యటించి పదాధికారులు, కార్యకర్తల మనోబలాన్ని పెంచడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరితోనైన పొత్తు పెట్టుకుని పోటీ చేయాలా, ఒంటరిగా బరిలోకి దిగాలా..? అనే దాని పై స్పష్టత లేదు. అయితే  పలుమార్లు ఒంటరిగానే బరిలోకి దిగుతానని రాజ్‌ఠాక్రే ప్రకటించినా అసెం బ్లీ ఎన్నికల వరకు ఏమీ జరుగుతుందనేది చూడాలి.

మరిన్ని వార్తలు