ఎత్తులు పై ఎత్త్తులు

30 Dec, 2013 23:34 IST|Sakshi

 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా అన్ని రాజకీయ పక్షాలు పావులు కదుపుతూ ముందుకు సాగారుు. ప్రజాకర్షణే లక్ష్యంగా ఉరకలు తీశాయి. అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు నీరాజనాల పర్వం కొనసాగగా, డీఎండీకే అధినేత విజయకాంత్‌కు మాత్రం గడ్డు పరిస్థితులే మిగిలాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు డీఎంకే అధినేత కరుణానిధికి శిరోభారంగా మారాయి. మోడీ గాలితో కమలనాథుల్లో ఉత్సాహం వికసించగా, డీఎంకే చీదరించుకోవడంతో ఒంటరితనాన్ని అలవరచుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. అన్నాడీఎంకే పట్టించుకోకపోవడంతో వామపక్షాల పరిస్థితి అయోమయంలో పడింది. ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులతో వ్యవహరించారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నినాదం తమిళనాట మిన్నంటడం మరో ప్రత్యేకత. 2013 రాజకీయ చిత్రం ఇది.             - సాక్షి, చెన్నై
 
 అన్నాడీఎంకే: ఈ ఏడాది కూడా అన్నాడీఎంకే తన హవాను కొనసాగించింది. ఉప ఎన్నికల్లో గెలుపు ఉత్సాహాన్ని రెట్టింపు చేయగా, ప్రధాని కుర్చీలో తమ అధినేత్రి జయలలితను కూర్చోబెట్టడమే లక్ష్యంగా కసరత్తులు మొదలుపెట్టారు. పార్టీల ఉద్వాసనల పర్వం, మార్పులు చేర్పుల దిశగా జయలలిత అడుగులు వేశారు. ప్రభుత్వ పాలనలోను తన ముద్రను ప్రదర్శించారు. చౌక ధరకే పేదోడికి కడుపు నింపాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన అమ్మ క్యాంటిన్ పథకం, తోట, పచ్చదనం నినాదంతో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారుు. కరుణానిధి కలల సౌధం కొత్త సచివాలయాన్ని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. ఈలం తమిళులకు మద్దతుగా, శ్రీలంక పైశాచికత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశ పెట్టారు. అభివృద్ధి పనులకు, ప్రాజెక్టులకు నిధుల వరద పారించినా అది జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారుకే దక్కింది. అయితే, కానరాని వర్షాలతో కన్నీటి మడుగులో మునిగిన డెల్టా అన్నదాతల్ని ఆదుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్ కొరత వెంటాడినా, కేంద్రం సవతి తల్లి ప్రేమ కొనసాగినా, అన్నింటిని ఎదురొడ్డి నిలబడటం విశేషం.
 
 
 డీఎంకే: ఈలం తమిళుల సంక్షేమ నినాదంతో కీలక నిర్ణయాలు తీసుకున్నా, అన్నీ బూడిదలో పోసిన  పన్నీరే అన్న చందంగా తయూరైంది డీఎంకే పరిస్థితి. అటు యూపీఏతో కటీఫ్, ఇటు తన గారాల పట్టి కనిమొళి రాజ్యసభ పదవి కోసం మద్దతు వేట వెరసి అపవాదులు తెచ్చి పెట్టాయి. నటి, పార్టీ నాయకురాలు ఖుష్బు, అధినేత కరుణానిధిని జత పరచి సాగిన పుకార్ల ప్రచారం పార్టీకి ఓ మచ్చే.  తన చిన్న కుమారుడు, పార్టీ కోశాధికారి స్టాలిన్‌ను అందలం ఎక్కించాలన్న ప్రయత్నాలు ఆవిరయ్యాయి. ఇందుకు కారణం మరో తనయుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి రూపంలో చిక్కుల్ని ఎదుర్కోవాల్సి రావడమే.  ఆయన మద్దతుదారుల తిరుగుబాటు ధోరణి, ఆయా జిల్లా పార్టీల్లో అంతర్గత కుమ్ములాటల్ని కొలిక్కి తేవడం శిరోభారమే. ప్రజల్లో నమ్మకాన్ని కల్గించడం లక్ష్యంగా టెసో ద్వారా ఈలం తమిళుల సంక్షేమ నినాదంతో, హిందీకి వ్యతిరేకంగా ఉద్యమంతో సేతు సముద్రం ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా, ఏడాది చివర్లో జరిగిన ఏర్కాడు ఉప ఎన్నిక ఓటమి ప్రజల్లో ఆ పార్టీ మీదున్న విశ్వసనీయతకు దర్పణం పట్టింది. కొత్త సంవత్సరంలో అదృష్టం కలసి వచ్చేనా అన్నట్టు రాజకీయ ఎత్తుగడలతో, రోజుకో వ్యాఖ్యతో ముందుకు సాగుతున్నారు.
 
 డీఎండీకే: గడిచిన కాలం డీఎండీకేకు చేదు అనుభవాలే మిగిల్చాయి. అధికార పక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు తమ ఎమ్మెల్యే చిక్కడం, పార్టీకి తీవ్ర లోటును మిగిల్చింది. పార్టీ ఎమ్మెల్యేలు పలువురు రెబల్స్ అవతారంతో తిరుగు బాటు చేయడం విజయకాంత్‌ను ఇరకాటంలో పడేసింది. అయితే, తన మీద, పార్టీ నాయకుల మీద కేసుల పర్వం కొనసాగినా, అసెంబ్లీ నుంచి తన ఎమ్మెల్యేలు ఆరు నెలలు సస్పెన్షన్‌కు గురైనా ఢీలా పడని నేత విజయకాం త్. ప్రజల పక్షాన నిలబడి అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవడంలో విజయం సాధించడం విశేషం. ఏడా ది చివర్లో పార్టీ సీనియర్ నేత బన్రూ టి రామచంద్రన్ గుడ్ బై చెప్పడం పార్టీకి తీరని లోటే. ఇక, తన ఓటు బ్యాంక్ లోక్‌సభ ఎన్నికల్లో కీలకం కానుండడంతో అందరి దృష్టి విజయకాంత్ మీదే ఉండటం గమనార్హం.
 
 కాంగ్రెస్: యథాప్రకారం గ్రూపు రాజ కీయాలతో కాంగ్రెస్ కాలాన్ని నెట్టుకొచ్చింది. కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. రాష్ట్ర పార్టీ బలోపేతానికి టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఈలం తమిళుల వ్యవహారంలో కేంద్రం తీరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్ని సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. రాష్ట్రంలో అతి పెద్ద వర్గంగా ఉన్న కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్ మద్దతుదారులు తమిళ మానిల్ కాంగ్రెస్ పునరుద్ధరణ నినాదాన్ని తెరపైకి తెచ్చి పార్టీలో కలకలాన్నే సృష్టించారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మద్దతుదారులు ఈలం నినాదంతో ప్రత్యేక జట్టు కట్టడం మరో చర్చే. కేంద్ర మంత్రి పదవి దూరం కావడం జయంతి నటరాజన్ వర్గానికి పెద్ద షాకే. డీఎంకే ఛీదరించుకోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసినట్టు అయింది. పన్నెండేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన కాంగ్రెస్ కార్యవర్గం ప్రకటన ఏడాది చివర్లో వెలువడటం ఆ పార్టీకి ఓ శుభవార్తే. తన ముద్రను రాష్ట్ర పార్టీ మీద వేయడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ చేస్తూ వస్తున్న ప్రయత్నాలు నిరాశే మిగిల్చాయి.
 
 పీఎంకే: ఈ ఏడాది పీఎంకే నాయకులకు గడ్డుకాలంగా మారింది. మరక్కానం అల్లర్లు ఆ పార్టీ అధినేత రాందాసు మొదలు అందరు నేతలను నెలల తరబడి కటకటాల్లోకి నెట్టించాయి. ఎట్టకేలకు బెయిల్ మీద బయటకు వచ్చినా, షరతులకు లోబడి కాలం నెట్టుకు రావాల్సిన పరిస్థితి. ఒంట రిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం, తమ నేతృత్వంలో సామాజిక కూటమి ఏర్పాటుకు నిర్ణయించడం, చివరకు పునః సమీక్షతో బీజేపీ జత కట్టే ప్రయత్నాల్లో ఉండటం, సంపూర్ణ మద్య నిషేధ నినాదంతో ఉద్యమ బాట కొనసాగిస్తుండటం గతాన్ని గుర్తుకు తెచ్చినట్టే.
 
 బీజేపీ: ఈ ఏడాది బీజేపీకి అనుకూల పరిస్థితులను కల్పించా యి. ఇన్నాళ్లు చతికిలబడ్డ పార్టీ నాయకుల్లో మోడీ గాలి ఉత్సాహాన్ని నింపింది. ఒకప్పుడు తమను ఛీదరించుకున్న ద్రవిడ పార్టీలు, తమ పక్షాన నిలబడే యత్నం చేస్తుండటంతో కమలనాథులు జబ్బలు చరుస్తుండటం గమనార్హం. ప్రజల్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా పాదయాత్రలు, గ్రామ యాత్రలు, చైతన్య యాత్రలు, ఉద్యమాలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ దూసుకెళుతుండటం విశేషం.  శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి మాత్రం అన్నాడీఎంకే నిర్ణయాలకు తందాన పాడటం పరిపాటే. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించడంలో వామపక్షాలు విఫలం అయ్యాకి. అన్నాడీఎంకే కూటమిలో తాము ఉన్నామని చాటుకునేందుకు పాకులాడి చివరకు ఛీ కొట్టించుకోవడం చేదు అనుభవం.
 
 వైఎస్సార్ కాంగ్రెస్: రాష్ట్రంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి వార్తల్లో వ్యక్తిగా అవతరించారు. మహానేత వైఎస్సార్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జగన్ కోసం జనం నినాదంతో ఇక్కడ చేపట్టిన సంతకాల సేకరణతో పాటుగా ‘సాక్షి’ ద్వారా తమ గళాన్ని పెద్ద ఎత్తున వినిపించా రు. తమవంతుగా ఆ పార్టీ నాయకులు ప్రజలకు సేవలు అందించి మహానేత వైఎస్సార్ మీదున్న అభిమానాన్ని, జన నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖ్యాతిని ఎలుగెత్తి చాటారు. ఇటీవల చెన్నైకు జననేత వచ్చిన క్రమంలో లభించిన ప్రజాదరణ చూసి నగరవాసులు విస్తుపోయూరు. తమిళనాడు సీఎంకు హారతులు పట్టినట్లుగా పొరుగు రాష్ట్ర నేతకు నీరాజనం పట్టడం రాష్ట్రంలోనే ప్రత్యేక చర్చకు దారి తీసింది. ఇదే  ఈ ఏడాది చివర్లో హైలెట్‌గా నిలిచింది.  
 
 
 

>
మరిన్ని వార్తలు