సుప్రీం చెప్పినా సరే.. వదలొద్దు

28 Sep, 2016 13:07 IST|Sakshi
సుప్రీం చెప్పినా సరే.. వదలొద్దు

బెంగళూరు: కర్ణాటక, తమిళనాడుల మధ్య ఏర్పడిన కావేరి జలాల వివాదం తీవ్రమవుతోంది. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని కర్ణాటకలో అన్ని పార్టీలు నిర్ణయించాయి. బుధవారం బెంగళూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నాయకులు తమ అభిప్రాయలను తెలియజేశారు. కావేరి జలాలను కర్ణాటకలో తాగు నీటి అవసరాలకు వాడాలని, తమిళనాడుకు విడుదల చేయరాదని అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు.

కావేరి జలాలను రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. నీటిని వదలకూడదని కర్ణాటక ఉభయసభలు తీర్మానం చేసినా.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ.. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని అన్ని పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని వార్తలు