సినిమా విడుదలకు అన్నీ సమస్యలే

18 May, 2015 02:48 IST|Sakshi

 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి , డిజిటల్ టెక్నాలజీ విధానం కారణంగా ఇప్పుడు చిత్ర నిర్మాణం సులువైనమాట వాస్తవమే. అయితే, దానిని విడుదల చేయడానికి నిర్మాత చాలా తంటాలుపడుతున్నారు. ముఖ్యంగా చిన్న చిత్రాలకు అడుగడుగున సమస్యలే. 30 లక్షలతో నిర్మాణంలో చిత్రం పూర్తి చేసి ఇస్తే, దాని ప్రచారానికి దాదాపు కోటిన్నర ఖర్చు చేయాల్సి వస్తున్న పరిస్థితి నెలకొంది. పెద్ద హీరోల చిత్రాలకు నిర్మాతలు పోటీపడి మరీ ప్రచారం చేస్తున్నారు. ప్రకటనల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు.  ఆంధ్రాలో అయితే, సినిమా ప్రదర్శనలకు నిబంధనలు పాటిస్తున్నారు.
 
 అలాంటి నిబంధనలు ఇక్కడ లేవు. ఇక పోతే, పైరసీ అంటూ గగ్గోలుపెడుతున్న సినీ సంఘాలు, వాటిని అరికట్టడంలోనూ వాగ్దానలకే పరిమితం అవుతున్నారు.  నిజంగా అలాంటి చిత్తశుద్ధి ఉంటే, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేయవచ్చు. అదే విధంగా పెద్ద నటుల చిత్రాలను ఒకే సారి వందల థియేటర్లలో విడుదల చేయడానికి పోటీ పడుతున్నారు. దీంతో చిన్న చిత్రాలకు థియేటర్ల కొరత ఏర్పడుతోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో  చిన్న నిర్మాతల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందనడానికి ఇలాంటి ఎన్నో కారణాలు ఎదురు అవుతున్నాయి అని సీనియర్ నిర్మాత కళైపులి జీశేఖరన్, జెనిఫర్ కరుప్పయ్య చిత్ర  ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు.
 
 సెలబ్రిటీ సినిమా పతాకంపై నవ నిర్మాత టీఎస్ వాసన్ నిర్మిస్తు, హీరోగా నటిస్తున్న చిత్రం జెన్నిఫర్ కరుప్పయ్య. మృదుల విజయ్ హీరోయిన్‌గా -నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు రాజ్‌కపూర్, రోహిణి, ఫాతిమా బాబు, సౌందర పాండి, మాస్టర్ భరణి ముఖ్య పాత్ర పోషించారు. జీఎం శరవణ పాండి కథాకథనం , మాటలు దర్శకత్వం బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రానికి జీ కిషోర్ కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది.  దర్శకుడు పేరరసు, ఫైట్ మాస్టర్ జాగువర్ తగం, విజయ్ మురళి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు