స్టేడియంలో భార్య ఉందని...

29 Oct, 2017 10:53 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : పేరుకు పబ్లిక్‌ సర్వెంట్, కానీ చేసేందంతా పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టడమే. భార్య స్టేడియం లోపల ప్రాక్టీస్‌ చేస్తుండడంతో లోపల ఎవరూ ఉండరాదంటూ  జాతీయ స్థాయి అథ్లెట్స్‌ ను బలవంతంగా బయటకు పంపించారంటూ ఒక ఐపీఎస్‌ అధికారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కంఠీరవ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయడానికి జాతీయ అథ్లెట్స్‌ స్టేడియంకు చేరుకున్నారు. అదే సమయంలో కంఠీరవ స్టేడియం డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అనుపమ్‌ అగర్వాల్‌ భార్య స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తుండడంతో మిగతావారిని సిబ్బందితో కలసి స్టేడియం నుంచి బయటకు పంపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత్యంతరం లేని క్రీడాకారులు స్టేడియంకు సమీపంలోనున్న కబ్బన్‌పార్క్‌లో ప్రాక్టీస్‌ చేశారు. అంతేకాకుండా ఘటనపై క్రీడాకారులతో పాటు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే ఫిర్యాదు స్వీకరించరాదంటూ పోలీస్‌ స్టేషన్‌లకు సూచించినట్లు కూడా తెలిసింది. దీంతో ఘటనపై బాధితులు సంపిగె రామనహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయబోగా స్వీకరించడానికి పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది.

అది అగర్వాల్‌ సొత్తేం కాదు : మంత్రి మధ్వరాజ్‌
ఈ ఘటనపై యువజన క్రీడాశాఖా మంత్రి ప్రమోద్‌ మధ్వరాజ్‌ కలబురిగిలో మీడియాతో మాట్లాడుతూ.. స్టేడియం ప్రభుత్వం సొత్తు కాదని, అధికారి అనుపమ్‌ అగర్వాల్‌ సొత్తు అంతకంటే కాదని ఘాటుగా అన్నారు. స్టేడియం కేవలం ప్రజల సొత్తని, ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు