న్యాయమూర్తులకు ఆమాత్రం తెలియదా..!

7 Sep, 2016 02:25 IST|Sakshi
న్యాయమూర్తులకు ఆమాత్రం తెలియదా..!

బెంగళూరు : ‘కర్ణాటకలో ప్రజలకు కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, అలాంటి పరిస్థితిలో ఏడాదికి మూడు పంటలు పండించుకునే పరిస్థితుల్లో ఉన్న తమిళనాడుకు తాగడానికి నీరు లేదని చెబుతున్నారంటే న్యాయమూర్తులకు అసలే మాత్రమైనా తెలుసా అన్న అనుమానం కలుగుతోంది’ అని మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి.దేవెగౌడ సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావేరి న దీ జలాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కావేరి నదీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు అన్యాయం జరిగింది.

అయితే ఆవేశపూరితంగా, హింసాత్మకంగా నిరసనను తెలియజేయడం సరికాదు. నిరసన కార్యక్రమాలన్నీ శాంతియుతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో కర్ణాటక తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఫాలి నారిమన్‌ను ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించడం వల్ల వచ్చే లాభం ఏదీ ఉండదు. ఫాలి నారిమన్‌కు కావేరి వివాదానికి సంబంధించిన పూర్తి విషయాలపై అవగాహన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ను కాదని మరో వ్యక్తిని నియమిస్తే సమస్య మరింత ఆలస్యమవుతుంది’ అని దేవెగౌడ వివ రించారు. కార్యక్రమంలో జేడీఎస్ ఎంపీ సి.ఎస్.పుట్టరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు