ధనుష్‌తో మరోసారి

27 Nov, 2015 02:10 IST|Sakshi
ధనుష్‌తో మరోసారి

వివాహానంతరం నటించను అని మళ్లీ నటిస్తున్న తారామణుల్లో నటి అమలాపాల్ ఒకరు. ఈమె నాయకిగా ఎంత త్వరగా ఎదిగారో అంతే త్వరగా పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెట్టారు. మైనా చిత్రంతో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలదొక్కుకున్న అమలాపాల్ ఆ తరువాత దైవతిరుమగళ్, వేట్టై, తలైవా, వేల ఇల్లాద పట్టాదారి తదితర చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు లోనూ బెజవాడ, నాయక్, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు.
 
  ఇలా నటిగా ఎదుగుతున్న సమయంలోనే దర్శకుడు విజయ్ ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. కొద్ది కాలం నటనకు దూరంగా ఉన్న అమలాపాల్ ఆ తరువాత తన భర్త నిర్మిస్తున్న చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవల సూర్య కీలక పాత్ర పోషస్తూ తన 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పాండిరాజ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న పసంగ-2 చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపి రీఎంట్రీ అయ్యారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 4 న విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించడానికి సిద్ధం అని ప్రకటించిన అమలాపాల్ ఇప్పుడు మరో చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.
 
 హిందీ చిత్రం నిల్‌బట్టీ సన్నటకు తమిళ్ రీమేక్‌లో నటించడానికి అమలాపాల్ గీన్‌సిగ్నల్ ఇచ్చారు. విశేషమేమిటంటే ఈ చిత్రంలో నటుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తో కలిసి నిర్మించనున్నారు. హిందీ చిత్రానికి దర్శకత్వం వహించిన అశ్వినీ అయ్యర్‌నే ఈ తమిళ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది కథానాయకి పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథా చిత్రం అట. అమలాపాల్‌కు అమ్మగా నటి రేవతి నటించనున్న ఈ చిత్రం వచ్చే నెల సెట్ పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. మరో విషయం ఏమిటంటే ధనుష్ అమలాపాల్ జంటగా ఇంతకు ముందు వేల ఇల్లా పట్టాదారి చిత్రంలో నటించారు. ఈ తాజా చిత్రంతో మరోసారి కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారన్న మాట.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా