అంబి లీలలు

12 Dec, 2014 08:05 IST|Sakshi
అంబి లీలలు

*మంత్రి అంబరీష్ సెల్‌లో తన అసభ్య నృత్యాలు, ఫొటోలు చూస్తూ కాలక్షేపం
*అట్టుడికిన ఉభయ సభలు
*బీజేపీ చేతికి కొత్త ఆయుధం
*తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే.. అంబరీష్‌పై కూడా తీసుకోవాంటూ డిమాండ్
*ఉభయ సభల్లో  మూడో రోజూ ఇదే తంతు

 
బెంగళూరు :  మంత్రి అంబరీష్ సెల్‌లో తన అసభ్య నృత్యాలు, ఫొటోలు చూస్తూ బుధవారం సభలో కాలక్షేపం చేసిన విషయం గురువారం వెలుగు చూసింది. దీంతో మూడవ రోజైన గురువారం కూడా సభల్లో ‘ సెల్ గోల’ తప్పలేదు. ఈ ఏడాది శీతాకాల సమావేశాలు సజావుగా జరగడం లేదు. మొదటిరోజు చెరుకు మద్దతుధర, రెండో రోజు మధ్యాహ్నం నుంచి  ‘చౌహాన్ సెల్ పురాణం’తో కొండెక్కిన కార్యక్రమాలు మూడో రోజూ అదే  బాటలో నడిచాయి.

ఉభయ సభల అధిపతులు ఎంత ప్రయత్నించినా అధికార విపక్ష నాయకులు వెనక్కు తగ్గకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సభలు తర్వాతి రోజుకు (శుక్రవారానికి) వాయిదా పడటంతో విలువైన సభా సమయం వ ృథా అయిపోయింది. అధికార పార్టీకు చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ బుధవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఒక వైపు చర్చ జరుగుతుంటే మరోవైపు తన పక్కన ఉన్న స్వపక్షానికి చెందిన ఎమ్మెల్యే మల్లికార్జునకు గతంలో తాను ఓ పబ్‌లో తాగిన మైకంలో చేసిన తాను చేసిన నాట్యాన్ని సెల్‌ఫోన్‌లో చూపిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ విషయం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా శాసనసభలో మూడో రోజైన గురువారం సభా కార్యక్రమాలు మొదలైన వెంటనే కాంగ్రెస్ పార్టీకు చెందిన పలువురు నాయకులు ‘బీజేపీ షేమ్...షేమ్’ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సభలో మొబైల్‌లో ప్రియాంకగాంధీని ఫొటోను అసభ్య రీతిలో జూమ్ చేసి చూసిన ప్రభుచౌహాన్‌ను ఒక రోజు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రతిస్పందించిన బీజేపీ నాయకులు ‘చేసిన తప్పునకు చౌహాన్ క్షమాపణ స్పీకర్‌కు ఇప్పటికే క్షమాపణ చెప్పారు.

సభలో కూడా చెప్పడానికి సిద్ధం. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. అలా కాదు అంటే మీ పార్టీకు చెందిన మంత్రి అంబరీష్, మల్లికార్జునలను కూడా ఒక రోజు సస్పెండ్ చేయాలి’ అని పేర్కొన్నారు. ఇందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. దీంతో శాసనసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సభను సజావుగా జరిపే పరిస్థితి కనిపించ పోవడంతో సభను కొద్ది సేపు వాయిదావేశారు. అధికార, ప్రతిపక్షానికి చెందిన నాయకులతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప తన కార్యలయంలో కొద్ది సేపు సమావేశమై.. ఇరు పార్టీల మధ్య సంధానానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ క్రమంలోనే సభను నడపడానికి స్పీకర్ విఫలయత్నం చేశారు. విపక్ష నాయకుడైన శట్టర్‌కు మాట్లాడుతూ... ‘క్షమాపణ కోరుతామన్నా అధికార పక్షం వినడం లేదు. చెరుకు రైతులు, ఉత్తర కర్ణాటక సమస్యల పై అడిగే ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవు. అందుకే అధికార పక్షం మొండిపట్టు పడుతోంది.’ అన్నారు.  దీంతో మరోసారి శాసనసభలో గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. స్పీకర్ ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో శాసనసభ సమావేశాలు మూడు గంటలకు వాయిదా పడింది.

శాసనమండలిలో

అటు శాసనమండలిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన నాయకులు పోడియంలోకి దూసుకెళ్లీ మరీ పోటాపోటీగా ధర్నా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం మూడు గంటలలోపు రెండు సార్లు సభను వాయిదా వేసి తిరిగి కార్యక్రమాలను నిర్వహించడానికి శాసనమండలి అధ్యక్షుడు శంకరమూర్తి ప్రయత్నించినా పరిస్థితిలో మార్పు రాలేదు.  
 విషయం తెలుసుకున్న స్పీకర్ కాగోడు తిమ్మప్ప  అటు మండలి, ఇటు శాసనసభకు చెందిన అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో పాటు ముఖ్యనేతలను తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడటానికి ప్రయత్నించారు.

అయితే ఈ సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ నాయకులు బయటకు వచ్చి శాసనసభ విపక్ష నాయకుడు శెట్టర్ కార్యాలయంలో వేరుగా సమాలోచనలు తెలిపారు. ‘అంబరీష్‌తో శాసన సభలో క్షమాపణ చెప్పించి తీరాల్సిందే’ అని సమాలోచనలో అందరూ బీజేపీ ఏకగ్రీవంగా అంగీకరించారు. అటుపై బీజేపీ గైర్హాజరీ నేపథ్యంలో శాసనసభ, పరిషత్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పది నిమిషాల అనంతరం ఉభయ సభలకు చెందిన బీజేపీ నాయకులు అంబరీష్‌తో క్షమాపణ చెప్పించాలని అటు శాసనసభలో, ఇటు పరిషత్‌లో  పట్టుపట్టారు. దీంతో స్పీకర్ సభను శుక్రవారం ఉదయం 9:30లకు వాయిదా వేయగా మండలి శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.  
 

>
మరిన్ని వార్తలు