నేనొచ్చా....

12 Apr, 2014 08:10 IST|Sakshi
నేనొచ్చా....

సాక్షి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది అభిమానులే తన నిజమైన ఆస్తి అని, వారి ప్రేమ, ఆప్యాయతల ముందు వందల కోట్ల రూపాయలు కూడా తనకు గొప్పవిగా కనిపించవని ప్రముఖ శాండల్‌వుడ్ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్ పేర్కొన్నారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా సింగపూర్‌లో చికిత్స తీసుకొని, అనంతరం మలేషియాలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అంబరీష్ శుక్రవారం నగరానికి తిరిగివచ్చారు.

ఈ సందర్భంగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బెంగళూరు ప్రెస్‌క్లబ్, రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్తంగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో తన భార్య సుమలతతో కలిసి అంబరీష్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదం, ప్రార్థనల కారణంగానే తాను మళ్లీ ఆరోగ్యవంతుడినై ప్రజా జీవితంలో రాగలిగానని  పేర్కొన్నారు. తన కోసం ప్రార్థించిన అభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

తాను సింగపూర్‌లో చికిత్స తీసుకుంటుండగా ఎంతో మంది తమ సొంత ఖర్చులతో చూసేందుకు వచ్చారని, వారందరి అభిమానాన్ని తానెప్పటికీ మరిచిపోలేనని అన్నారు.  ప్రజలు తనపై ఉంచిన నమ్మకమే తనను మంత్రిని చేసిందని, ప్రస్తుతం తాను గుడిసెలు లేని రాష్ట్రం కోసం కలలు కంటున్నానని అన్నారు.

ఏడాది కాలంగా సిద్ధరామయ్య నేతృత్వంలోని తమ ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఈ పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి అపూర్వ విజయాన్ని అందిస్తాయని  అన్నారు.  దేశాభివృద్ధి గురించి ఒక ప్రణాళిక అంటూ లేని నరేంద్రమోడీ ప్రధాని ఎలా కాగలరని ప్రశ్నించారు. త్వరలోనే పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపారు.  సుమలత మాట్లాడుతూ...తన భర్త అంబరీష్‌కు ఇది నిజంగానే పునర్జన్మ అని పేర్కొన్నారు.  ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థనలు జరిపిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు