తీరని కష్టాలెన్నో..!

25 Mar, 2020 13:30 IST|Sakshi
గర్భిణిని మంచపై పెట్టి ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

గిరిజన ప్రాంతాల్లో కానరాని అభివృద్ధి చర్యలు  

మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు  

ఆస్పత్రి చేరాలంటే మంచాలు, డోలీలే గతి  

పట్టించుకోని నేతలు, అధికారులు

ఒడిశా, మల్కన్‌గిరి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దాదాపు 7 దశాబ్దాలు దాటినా చాలా గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు. దీంతో అక్కడి గిరిజనులు తమ అవసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్య సదుపాయాల కోసం కొన్ని మైళ్ల దూరం కొండలు, గుట్టలు, వాగులు, నదులు దాటుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. ఈ క్రమంలో ప్రమాదాల రూపంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవే విషయాలు నేతలు, అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. వారిని ఎన్నికల సమయంలో ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలుగా స్వీకరించి, వారి అభివృద్ధి చర్యలను ఎవ్వరూ కాంక్షించడం లేదు. జిల్లాలోని చిత్రకొండ సమితిలో కటాఫ్‌ ఏరియాలోని నువాగుడ పంచాయతీలో ఉన్న పల్లీగుడ గ్రామానికి చెందిన డొంబునీ హంతాల్‌ అనే గర్భిణికి పురిటినొప్పులు సోమవారం ప్రారంభమయ్యాయి.

దీంతో ఆమె పడుతున్న బాధను తాళలేని కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చేందుకు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో తాము రాలేమని అంబులెన్స్‌ సిబ్బంది తేల్చి చెప్పింది.  గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్కా రహదారికి తీసుకురావాలని సూచించారు. దీంతో చేసేదీ ఏమీ లేకపోవడంతో బాధితురాలి భర్త విష్ణు గ్రామస్తులతో కలిసి, భార్యను మంచంపై ఉంచి పక్కా రహదారి ఉన్న చిత్రకొండకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి అంబులెన్స్‌లో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గురుప్రియ వంతెన పూర్తయితే తమ ప్రాంతాలకు రహదారుల నిర్మాణాలు జరుగుతాయని అంతా అన్నారని, అయితే ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదని బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామాలకు అంబులెన్స్‌లు వచ్చేలా పక్కా రహదారుల నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా