240 కి.మీ.. 3 గంటలు..!

6 Aug, 2019 07:31 IST|Sakshi
గస్తీ వాహనం, డ్రైవర్లకు అభినందనలు..

అంబులెన్స్‌ డ్రైవర్‌ వీరోచితం

రెండు నెలల బిడ్డ రక్షింపు

సహకరించిన సహచర డ్రైవర్లు

సాక్షి, చెన్నై : ఓ చిన్నారి ప్రాణాల్ని రక్షించేందుకు అంబులెన్స్‌ డ్రైవర్‌ సాహసం చేశాడు.  240 కి.మీ దూరాన్ని 3 గంటల్లో ఛేదించి, సకాలంలో ఆస్పత్రిలో చేర్పించాడు. ఓచిన్నారి ప్రాణాన్ని కాపాడ డంలో కీలక పాత్ర పోషించాడు. అందరి అభినం దనలు  అందుకున్నాడు. కోయంబత్తూరులో జరిగి ఈ ఘటనల ఆలస్యంగా వెలుగు చూసింది. కోయంబత్తూరు జిల్లా మలు మచ్చం పట్టి గ్రామానికి చెందిన నందన్‌ స్వామి భార్య ఆర్తీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి రెండు నెలలు అవుతున్నది. బిడ్డ ఆరోగ్యంగానే ఉండటంతో తేనిలోని తల్లి దండ్రుల వద్దకు ఆర్తీ వెళ్లింది. ఆదివారం హఠాత్తుగా ఆ బిడ్డ అనారోగ్యం పాలయ్యాడు. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించగా, అత్యవసరంగా కోయంబత్తూరుకు తరలించాల్సిందేనని వైద్యులు తేల్చారు. శ్వాస నాళంలో సమస్య ఉన్నదని, తక్షణం కోయంబత్తూరుకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తేనికి సమీపంలో ఉన్న కేరళ రాష్ట్రం తిరుచ్చూరు నుంచి ఇంక్కుబేటర్‌ సదుపాయం కల్గిన అంబులెన్స్‌ను రప్పించారు. చిన్నమనూరుకు చెందిన సతీష్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ అంబులెన్స్‌ను ఆగమేఘాల మీద తేనికి రప్పించారు. దీనిని కేరళ మనపురంకు చెందిన జాఫర్‌ అలీ (31) నడిపాడు. సాయంత్రం మూడు గంటల సమయంలో అంబులెన్స్‌ తేని ఆస్పత్రి ముందు ఆగింది. అత్యవసరంగా బిడ్డను కోయంబత్తూరుకు తరలించాలని అక్కడి వైద్యులు డ్రైవర్‌కు సూచించారు.

సహకారం అందించిన వాట్సాప్‌ గ్రూపు
తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్, దిండుగల్, తేని, కేరళ సరిహద్దుల్లోని కొన్ని జిల్లాలకు చెందిన అంబులెన్స్, క్యాబ్‌ డ్రైవర్లు వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసుకుని, పరస్పరం సహకారం అందించుకుంటూ వస్తున్నారు. ఇది జాఫర్‌ అలీకి ఎంతో తోడ్పాటును అందించింది. తేని నుంచి కోయంబత్తూరుకు రెండు నెలల బిడ్డను అత్యవసరంగా తరలిస్తున్నామని, సహకరించాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో ఆయా ప్రాంతాల్లోని అంబులెన్స్, క్యాబ్‌ డ్రైవర్లు అప్రమత్తం అయ్యారు. సరిగ్గా సాయంత్రం 3 గంటలకు తేని ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌ దూసుకెళ్లింది. బిడ్డకు వైద్య సహకారం అందించేందుకు పాలక్కాడుకు చెందిన అశ్విన్‌ కాంత్‌ అసిస్టెంట్‌గా అందులో పయనించాడు. అంబులెన్స్‌ రాష్ట్ర రహదారిలో దూసుకొస్తుండటం గురించి జీపీఎస్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎక్కడెక్కడ ట్రాఫిక్‌ జాంలకు ఆస్కారం ఉందో అక్కడల్లా డ్రైవర్లు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. కొన్ని చోట్ల వాహనాలు దూసుకు రాకుండా జంక్షన్ల వద్ద రోడ్డుకు అడ్డంగా అంబులెన్స్‌లను, క్యాబ్‌లను పెట్టారు. దీంతో ఎక్కడ ఆగకుండా తిరుప్పూర్‌ వరకు అంబులెన్స్‌ అతి వేగంగా దూసుకొచ్చింది. అయితే, తిరుప్పూర్‌సమీపంలో ట్రాఫిక్‌ మరింతగా పెరగడంతో సమాచారం అందుకున్న హైవే గస్తీ సిబ్బంది తమ వంతుగా అలర్ట్‌ అయ్యారు. అంతే కాదు, అక్కడి మరి కొన్ని అంబులెన్స్‌లు బిడ్డను తరలిస్తున్న అంబులెన్స్‌కు అటు ఇటు ముందుకు దూసుకొచ్చి సరిగ్గా 6 గంటలకు కోయంబత్తూరులోని ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లతో వైద్యులు ఆ బిడ్డను లోనికి తీసుకెళ్లి, అందుకు తగ్గ చికిత్సలు అందించారు.

తేని కోయంబత్తూరు మధ్య 240 కిలోమీటర్ల దూరం ఉంది. సాధారణంగా పయన సమయం ఐదు గంటలు. అయితే, ఈ అంబులెన్స్‌ డ్రైవర్‌ సాహసంతో సరిగ్గా 3 గంటల వ్యవధిలోనే ఆ చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించగలిగారు. చికిత్స అనంతరం సోమవారం ఆ బిడ్డను జనరల్‌ వార్డుకు మార్చారు. తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి కారకులైన అందరు అంబులెన్స్, క్యాబ్‌ డ్రైవర్లు, సహకరించిన వారికి నందన్, ఆర్తీ దంపతులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కాగా శరత్‌కుమార్, రాధిక, చేరన్‌ నటించిన చెన్నైలో ఒక రోజు చిత్రాన్ని తలపించే విధంగా ఈ అంబులెన్స్‌ పయనం సాగింది. నటుడు సూర్య అభిమానులు ట్రాఫిక్‌ అడ్డంకుల్ని ఆ చిత్రంలో తొలగించినట్టుగా, ఇక్కడ డ్రైవర్లు దూసుకు రావడం విశేషం.

మరిన్ని వార్తలు