సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా?

23 Apr, 2015 02:33 IST|Sakshi
సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా?

నటి కుష్బు పేరు మరోసారి వార్తల్లో కెక్కింది. దర్శకుడు ఏఎం ఆర్మ్రేష్ ఆమెపై ధ్వజమెత్తారు. ఇంతకుముందు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఇతివృత్తంతో వనయుద్ధం, రాజీవ్‌గాంధీ హత్యోదంతో కుప్పి చిత్రాన్ని తెరకెక్కించిన ఈయన తాజాగా ఒరు మెల్లియకొడు పేరుతో చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రం కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి శశిధర్ భార్య సునందా పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ చిత్ర కథ గురించి చెప్పాలని చిత్ర యూనిట్ సభ్యులను కుష్బు డిమాండ్ చేసినట్లు దర్శకుడు రమేష్ ఆరోపణలు చేశారు.
 
  అంతేకాదు కుష్బు చర్యలను ఆయన మండిపడ్డారు. కుష్బు తమ యూనిట్‌కు చెందిన ఒకరితో చిత్ర కథ గురించి విచారించారన్నారు. సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా? అంటూ అడిగారని అన్నారు. అయితే తన చిత్ర కథను ఎవరికి చెప్పేది లేదన్నారు. ఏ దర్శకుడు, నటుడు తన చిత్ర కథ గురించి బయటకు చెప్పరన్నారు. అయినా కుష్బు తన సహాయ దర్శకుడిని కథ గురించి అడిగేకంటే డెరైక్ట్‌గా తననే అడగవచ్చన్నారు. నిజమే తన చిత్రం ఒక మర్మ హత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమేనని స్పష్టం చేశారు. మనీషా కొయిరాల హత్యకు గురవుతారన్నారు. ఆ హత్య గురించి ఇన్‌వెస్టిగేషన్‌నే చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. ఇంతకంటే ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని దర్శకుడు రమేష్ అన్నారు.
 
  నేను ఎవరినీ అడగలేదు :
 రమేష్ ఆరోపణలను నటి కుష్బు ఖండించారు. దీని గురించి ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంటూ సునందా పుష్కర్ ఆత్మహత్య సంఘటన ఇతివృత్తంలో చిత్రం రూపొందుతోందని ఆ చిత్ర కథ గురించి చెప్పాలని తాను డిమాండ్ చేసినట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. నిజానికి అలా తాను ఎవరినీ అడగలేదని స్పష్టం చేశారు. అర్జున్ భార్య చిత్రంలో నటించమని తనను అడిగారన్నారు. తాను చిత్రాల్లో నటించడం మానేసి చాలా కాలం అయ్యిందని వారికి చెప్పానని అంతేకానీ కథ గురించి కూడా అడగలేదని కుష్బు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు