అనంతపురం సమీపంలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు

30 May, 2014 02:35 IST|Sakshi
అనంతపురం సమీపంలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు
 • అనంతపురం సమీపంలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం
 •  పది నెలల క్రితం సర్వే చేసిన ఏఏఐ అధికారులు
 •  ప్రత్యేక ప్యాకేజీలో మినీ ఎయిర్‌పోర్ట్ ప్రస్తావనే లేని వైనం
 •  విమానాశ్రయం ఏర్పాటైతే పారిశ్రామిక ప్రగతి, విద్యాభివృద్ధికి మార్గం సుగమం
 •  పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు చేతుల్లో భవితవ్యం
 •  సాక్షి ప్రతినిధి, అనంతపురం :  అనంతపురం సమీపంలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హడావుడి చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారులు అనువైన ప్రదేశాల కోసం పర్యటించినప్పుడు రెండు స్థలాలను కూడా గుర్తించారు. ఇదంతా జరిగి పది నెలలైనా  ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం లేదు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన అశోక్ గజపతిరాజు పౌరవిమానయాన శాఖ మంత్రి పదవి స్వీకరించడంతో మినీ ఎయిర్‌పోర్ట్‌పై ఆశలు చిగురిస్తున్నాయి.

  వివరాల్లోకి వెళితే.. విమాన సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో గతంలో ఉన్న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇదే సమయంలో రాష్ట్ర విభజనకు యూపీఏ సర్కారు జూలై 30న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అనంతపురం నగర నడివీధుల్లో సమైక్యాంధ్ర ఉద్యమ ఆవిర్భావానికి దారితీసింది.

  ఉద్యమం మహోగ్రరూపం దాల్చిన సమయంలోనే.. అనంతపురంలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హడావుడిగా ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల బృందం ఆగష్టు 31న జిల్లాలో పర్యటించింది. ఆరు కిలోమీటర్ల మేర రన్ వేతో పాటు మినీ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రెండు వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని ఏఏఐ అధికారులు తేల్చారు.

  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, రెవెన్యూ అధికారులతో కలిసి ఏఐఐ అధికారుల బృందం.. మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం అన్వేషించింది. అనంతపురం నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో బళ్లారి-అనంతపురం రోడ్డుకు సమీపంలో ఒక ప్రదేశాన్ని.. ఎన్‌హెచ్-44కు దగ్గరలో కనగానిపల్లి-రాప్తాడు మండలాల సరిహద్దులోని మరొక ప్రదేశాన్ని మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు గుర్తించింది.

  ఇదే అంశాన్ని కేంద్రానికి నివేదించింది. ఈలోగా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి.. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉక్కుపాదంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేశాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన సాఫీగా జరిగిపోయింది. విభజన సమయంలో సీమాంధ్రకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేస్తామని కేంద్రం పేర్కొంది.

  కానీ.. అనంతపురం జిల్లాలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రత్యేక ప్యాకేజీలో ఎక్కడా పొందుపరచలేదు. ఈలోగా ఎన్నికలు రానే వచ్చాయి. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 8న ఏర్పాటు కానుంది.

  మన రాష్ట్రానికే చెందిన అశోక్‌గజపతిరాజు కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత తరుణంలో అనంతపురంలో మినీ ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఆయన చేతుల్లో ఉంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మినీ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తే.. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి బీజం వేయవచ్చు. జిల్లాలో ఇనుప ఖనిజం, సున్నపురాయి వంటి నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. చౌకగా భూమి లభిస్తుంది. విస్తారంగా మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు, రవాణా మార్గాలు మెరుగ్గా ఉన్నాయి.

  మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే పారి శ్రామికాభివృద్ధి ఊపందుకునే అవకాశం ఉంది. దీనికి సమాంతరంగా విద్యారం గం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉం టుంది. జిల్లాకు మంజూరైన ఐఐఎస్‌సీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సస్) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు త్వరితగతిన ఏర్పాటవుతాయి. ఈ పరిస్థితిలో మినీ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
   

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు