ఆంధ్రా అత్త.. అన్నానగర్‌ కోడలు.. అదిరే జ్యూస్‌లు

12 Jul, 2017 16:36 IST|Sakshi
ఆంధ్రా అత్త.. అన్నానగర్‌ కోడలు.. అదిరే జ్యూస్‌లు
కేకేనగర్‌ : ఫ్రూట్‌ జ్యూస్‌లతో ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నారు ఈ అత్తాకోడళ్లు. గత పదేళ్లుగా ముగప్పేర్‌ ఈస్ట్‌లో నివసిస్తున్న అత్త ప్రేమ, కోడలు లక్ష్మీలు ఇంట్లోనే రకరకాల పండ్లతో ప్రకృతి సిద్ధంగా జ్యూస్‌లను తయారు చేసి అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రారంభంలో ఇంటికి వచ్చిన అతిథులకు, స్నేహితులకు తాగడానికి జ్యూస్‌ చేసి ఇచ్చేవారు. వారు వారికి తెలిసిన వారికి చెప్పి ఆర్డర్లు ఇవ్వడంతో వీరి చిన్న పాటి వ్యాపారానికి గిరాకీ పెరిగింది. రోజూ పది లీటర్ల జ్యూస్‌ల నుంచి సీజన్‌లలో 150 లీటర్ల వరకు అమ్మకాలు సాగుతుంటాయని ప్రేమ తెలిపారు.

ప్రేమ తెలుగు వారు కావడం విశేషం. ఆమె పుట్టిల్లు తిరుపతికాగా కోడలు లక్ష్మీ చెన్నై అన్నానగర్‌కు చెందినవారు.ప్రేమ నాన్న వేదాంతచారి. ఆయన తిరుమల కొండపై అహోబిలం మఠంలో ముద్రకర్తగా 65 సంవత్సరాలు సేవలందించారు. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకుని గత 40 ఏళ్ల కిందట చెన్నై వచ్చేశారు. భర్త రామభద్రన్‌ టాన్సీ విశ్రాంత ఉద్యోగి. కుమారుడు ఆరవముదన్‌కు వివాహం జరిగిన అనంతరం కోడలు లక్ష్మితో కలిసి ప్రేమ జ్యూస్‌ వ్యాపారం ప్రారంభించారు.

ఈ విషయమై ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు తాము తయారు చేసే పండ్ల జ్యూస్‌లను ఎంతో ఇష్టంగా తాగుతారని తెలిపారు. చిన్న ప్లిలలు సాధారణంగా పాలు తాగాలంటే మొండికేస్తారు. వారి తల్లుల కోరిక మేరకు రోస్‌మిల్క్‌లను తయారు చేసి అందిస్తున్నట్టు పేర్కొన్నారు. సీజన్లతో పని లేకుండా అన్ని సీజన్లకు తగినట్లు ఫ్రూట్‌ జ్యూస్‌లను తయారు చేయడం తమ ప్రత్యేకత అని ప్రేమ చెప్పారు. లెమన్, పైనాపిల్, గ్రేప్, మ్యాంగో, జింజర్‌ జ్యూస్‌లు, ఇంకనూ లెమన్‌ ప్లెయిన్, జింజర్‌ లెమన్, లెమన్‌– నన్నారి, లెమన్‌ – మింట్, పిల్లల కోసం ప్రత్యేకంగా రోస్‌మిల్క్‌ తయారు చేస్తామని అన్నారు.

తమ వ్యాపారానికి ఎలాంటి ప్రకటనలు, పబ్లిసిటీ ఇవ్వలేదన్నారు. ప్రేమ, వినియోగదారుల పోత్రాహం, అభిమానమే తమ వ్యాపార రహస్యం అన్నారు ప్రేమ నవ్వుతూ.. లక్ష్మీ మా ట్లాడుతూ.. సమ్మర్‌ సీజన్లో జింజర్, మిం ట్‌తో తయారు చేసిన జ్యూస్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అల్లం శరీ రంలో చురుకుదనాన్ని కల్గించి అలసటను పోగొడుతుందని వివరించారు. ఒక జ్యూస్‌ను తయారు చేయడానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని లక్ష్మి తెలిపారు.

జ్యూస్‌లలో కలపడానికి తాజా పండ్లను తీసుకుంటామని, చక్కెర సిరప్‌ను వేడి చేసి ఫ్రెష్‌గా తయారు చేసి చల్లారిన తర్వాత జ్యూస్‌లలో కలుపుతామని, తాము తయారు చేసే ఈ జ్యూస్‌లు ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయని ఈ అత్తాకోడళ్లు తెలిపారు. ఖర్చులకు పోగా వచ్చే ఆదాయాన్ని కూడబెట్టి సత్కార్యాలకు వినియోగించాలనేది ఈ ఇద్దరి కోరిక. వీరితో పాటు కుటుంబ సభ్యులందరూ అదే కోరుకుంటున్నారు. మనం కూడా వారి కోరిక నెరవేరాలని ఆశిద్దాం.  
 
మరిన్ని వార్తలు