అక్రమ విక్రయం

10 Oct, 2013 01:28 IST|Sakshi

సాక్షి, ముంబై: నష్టాల్లో నడుస్తున్నాయని కుంటిసాకులు చూపుతూ రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలను చౌకగా అమ్మేస్తున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్తలు అన్నా హజారే, మేధా పాట్కర్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టాలను కారణంగా చూపుతూ అయినవారికి తక్కువ ధరకే చక్కెర కర్మాగారాలను కట్టబెడుతున్నారని, ఈ వ్యవహారం మొత్తంలో పదివేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వారు ఆరోపించారు. సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలోని ఆజాద్‌ మైదాన్‌ నుంచి మంత్రాలయ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నాహజారే, మేధా పాట్కర్‌లు అధికార, ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. కర్మాగారాలను కొనుగోలు చేసిన వారితో రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్నాయని ఆరోపించారు. న్యాయవిచారణ జరిపించాలి..


చక్కెర పరిశ్రమల విక్రయాల్లో జరిగిన కుంభకోణానికి సంబంధించిన న్యాయవిచారణ జరిపించాలని అన్నా హజారే, మేధా పాట్కర్‌లు డిమాండ్‌ చేశారు. దీంతోపాటు ఇతర పరిశ్రమల నిర్వహణపై కూడా విచారణ జరపాలన్నారు. ఈ కుంభకోణంలో అధికార, ప్రతిపక్షాలు బాధ్యులేనని చెప్పారు. న్యాయవిచారణ జరిపించినట్టయితే బీహార్‌లో లాలూప్రసాద్‌ యాదవ్‌ జైలుకు వెళ్లినట్టు అనేక మంది మహారాష్టల్రోని నాయకులు కూడా కుంభకోణం కేసుల్లో జైలుకు వెళ్తారన్నారు. ఈ సభలో ఎంపీ రాజు శెట్టి, మాజీ ఎమ్మెల్యే మాణిక్‌ జాధవ్‌లతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులు, చక్కెర పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక మంది రైతులు, కార్మికులు పాల్గొన్నారు. వీరంతా ప్రభుత్వ, ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు.

జైలుభరో చేపడతాం..
న్యాయవిచారణ జరిపి, జరుగుతున్న విక్రయాలను నిలిపివేయనట్టయితే జైలుభరోకు పిలుపునిస్తామని హజారే, పాట్కర్‌లు హెచ్చరించారు. చక్కెర పరిశ్రమలన్నింటిపై యాజమాన్య హక్కులు రైతులకే కల్పించాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్టవ్య్రాప్తంగా జైలుభరో చేపడతామని హెచ్చరించారు. ఈ సభ అనంతరం సహ్యాద్రి గెస్‌‌టహౌస్‌కు వెళ్లిన వీరందరు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌తో భేటీ అయ్యారు. కుంభకోణానికి సంబంధించిన విషయాలను ఆయనకు వివరించారు. వెంటనే విక్రయాలను ఆపివేయాలని కోరారు.
 

>
మరిన్ని వార్తలు