మరో పది అడుగులే..

9 Aug, 2014 02:32 IST|Sakshi

శివమొగ్గ : జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రముఖ జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. వానలు తగ్గడంతో వరదలు వచ్చిన ప్రాంతాల్లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయి. గత 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమకనుమల ప్రదేశాలైన మాణి డ్యాంలో 65 మిల్లీమీటర్లు, యడూరి 72 మి.మీ, హులికల్లు 70 మి.మీ, మాస్తీకట్టె 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక శివమొగ్గ 9.20 మి.మీ, తీర్థహళ్లి 72 మి.మీ, సాగర 15.40 మి.మీ, శికారిపుర 8.60 మి.మీ, సొరబ 16.40 మి.మీ, హొసనగర 21.20 మిల్లీమీటర్లు కురిసింది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఏడు తాలూకాల్లో 97.60 మి.మీ. వర్షపాతం నమోదైంది.
 
లింగనమక్కి డ్యాం భర్తీకి పది అడుగులు మాత్రమే
 
రాష్ట్రంలో ప్రముఖ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి డ్యాం భర్తీకి ఇక పది అడుగులు మాత్రమే మిగిలింది. డ్యాం గరిష్ట నీటిమట్టం 1,819 అడుగులు కాగా, శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అందిన సమాచారం ప్రకారం నీటిమట్టం 1809.45 అడుగులకు చేరుకుంది.

జలాశయ పరిసరాల్లో వర్షం తగ్గుముఖం పట్టడంతో డ్యాం ఇన్‌ఫ్లో 32,424 క్యూసెక్కులకు తగ్గింది. ఇక భద్రా జలాశయ నీటిమట్టం 186 అడుగులు కాగా, ఇప్పటికే గరిష్ట స్థాయి 184.10 అడుగులకు చేరుకుంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 29,667 క్యూసెక్కులు ఉండగా, అందులో 26,091 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగా జలాశయం ఇప్పటికే గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది.

జలాశయంలోకి ఇన్‌ఫ్లో 60 వేల క్యూసెక్కులుండగా, అంతే పరిమాణంలో విడుదల చేస్తున్నారు. మాణి జలాశయం గరిష్ట నీటిమట్టం 594.36 అడుగులు కాగా, ప్రస్తుతం డ్యాంలో 586.63 అడుగుల నీరున్నాయి. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 4,484 క్యూసెక్కులు ఉంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో పొంగి పొర్లుతున్న తుంగా, భద్రా, వరదా నదులు శాంతించాయి. ఎడతెరపిలేని వానల కారణంగా జిల్లాలో సుమారు రూ.100 కోట్లు న ష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
 

మరిన్ని వార్తలు