మరో మూడు ఉడాలు

15 Feb, 2017 02:04 IST|Sakshi
మరో మూడు ఉడాలు

అనంతపురం, కర్నూలు, కాకినాడ కేంద్రంగా ఏర్పాటు
చంద్రన్న బీమా కింద అదనంగా రూ.30 వేలు
అర్బన్‌ ప్రాంతాల్లో మూడు కేటగిరీల్లో ఇళ్ల నిర్మాణం
మద్యం షాపుల లైసెన్సు ఫీజుల తగ్గింపు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు


సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో మూడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఉడా)ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతపురం, కర్నూలు, గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. అలాగే ‘చంద్రన్న బీమా’ కింద కార్మికులకు అదనంగా రూ.30 వేల పరిహారమివ్వాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.

► మాతృమూర్తిపై గౌరవం పెంపొందేలా ‘అమ్మకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం.
► అనంతపురం కేంద్రంగా 3,098.46 చదరపు కిలోమీటర్ల పరిధిలో అనంతపు రం–హిందూపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(అహుడా) ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 177 గ్రామాలు.
► తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా 2,215.50 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) ఏర్పాటు. దీని పరిధిలో 6 మున్సిపాల్టీలు, 26 మండలాల్లోని 280 గ్రామాలు.
► కర్నూలు కేంద్రంగా 2,414.69 చ.కిలోమీటర్ల విస్తీర్ణంలో కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) ఏర్పాటు. దీని పరిధిలో 8 మండలాల్లోని 111 గ్రామాలు. వీటి ఏర్పాటు నిమిత్తం ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయం.
► ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ కింద అర్బన్‌ ప్రాంతాల్లో 3 కేటగిరీల్లో 1,20,106 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం.
► అగ్రిగోల్డ్‌కు కీసరలో ఉన్న 350 ఎకరాలు, విజయవాడలోని 8 వాణిజ్య ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కోర్టు ను అభ్యర్థించాలని నిర్ణయం. కోర్టుల్లో లేని అక్షయ గోల్డ్, బొమ్మరిల్లు, కేశవరెడ్డి సంస్థల వివాదాలను పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని పోలీసు, రెవెన్యూ శాఖలకు ఆదేశం.
► ఏపీ సైబర్‌ సెక్యూరిటీ విధానం–2017కు ఆమోదం.
► ఈ విద్యా సంవత్సరం నుంచి సైబర్‌ సెక్యూరిటీ, ఐవోటీ తదితర కోర్సులను ప్రవేశపెడుతూ పాఠ్యాంశాల్లో మార్పు చేయా లని నిర్ణయం. 2017–18ను ఇ–ప్రగతి సంవత్సరంగా పరిగణించాలని తీర్మానం.
► ఎస్టీ విద్యార్థుల కోసం విజయవాడలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌)లో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అనుమతి.
► అమిటీ, విట్, సెంచూరియన్, ఎస్‌ఆర్‌ఎం ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుకూలంగా అంగీకార లేఖలకు సంబంధించిన సవరణలకు ఆమోదం.
► విభజన చట్టం తర్వాత రాష్ట్రం బయట తలెత్తిన సమస్యల పరిష్కారానికి సంబంధించిన మంత్రుల బృందానికి బదులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఇచ్చిన జీవోకు ఆమోదం.
► మద్యం షాపుల లైసెన్సు ఫీజును వందలో 25 శాతానికి తగ్గించాలని నిర్ణయం. కేంద్రానికి చెల్లించే సర్వీస్‌ ట్యాక్స్‌ను తగ్గించుకునేందుకు ఈ విధానానికి ఆమోదం. తగ్గించిన ఫీజును అదనపు ఛార్జీల పేరుతో మళ్లీ లైసెన్సుదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయం.

‘పతంజలి’ ఆయుర్వేద సంస్థకు 172 ఎకరాలు
► విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నారావుపల్లిలోని 172.84 ఎకరాలను పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు కేటాయిం చేందుకు గానూ ఏపీఐఐసీకి అనుమతి. ఆహార, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకరం రూ.3 లక్షల చొప్పున కేటాయించేలా నిర్ణయం
► చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరులోని 100 ఎకరాల భూమిని వైష్ణవి మెగా ఫుడ్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఎకరం రూ.1.50 లక్షల చొప్పున కేటాయించేలా ఏపీఐఐసీకి అనుమతి.

మరిన్ని వార్తలు